వాస్తవాధీన రేఖ వద్ద శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తూర్పు లద్ధాఖ్‌లోని సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని పునరుద్ధరించాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. గతంలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. వాస్తవాధీన రేఖ వద్ద నుంచి బలగాలను వెనక్కి మళ్లించే విషయమై..భారత్-చైనా సైన్యాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య... 15గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన చర్చలు బుధవారం తెల్లవారుజామున 2గంటలకు ముగిసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ సుదీర్ఘ భేటీలో సైనిక ఉపసంహరణ పైనే సమావేశంలో ఏకాభిప్రాయనికి వచ్చినట్లు తెలుస్తోంది.
నాలుగో విడత కమాండర్ స్థాయిలో జరిగిన ఈ చర్చల్లో భారత్ తరపున.. లేహ్‌లోని 14 కార్ప్ దళాల కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ ప్రాతినిథ్యం వహించారు. చైనా నుంచి దక్షిణ జిన్‌జియాంగ్ సైనిక ప్రాంత కమాండర్ లియూ లిన్ పాల్గొన్నారు. తదుపరి దశలో బలగాల ఉపసంహరణకు అనుసరించాల్సిన విధివిధానాలను ఈ భేటీలో భారత్-చైనా అంగీకరించాయి. ఒప్పందం కుదిరిన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించి ఇరుదేశాల సైనిక అధికారులు మరోసారి సంప్రదింపులు జరపనున్నారు.
'చర్చల్లో పురోగతి'
భారత్‌తో సరిహద్దు వివాదం అంశమై జరిగిన చర్చల్లో పురోగతి నమోదైందని ప్రకటించింది చైనా. తదుపరి సైనిక బలగాల వెనక్కి తరలింపు లక్ష్యంగానే చర్చలు జరిపినట్లు వెల్లడించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకే సమావేశానికి హాజరైనట్లు ప్రకటించారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చినుయింగ్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ సమావేశం సందర్భంగా పాంగాంగ్ సరస్సు ఫింగర్ ఏరియా నుంచి పూర్తిస్థాయిలో వెనక్కి వెళ్లేందుకు చైనా సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. గల్వాన్, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి వెనక్కి తరలేందుకు అంగీకరించిందని తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఆయుధాల కొనుగోలులో సైన్యానికి మరింత స్వేచ్ఛ