భారత ఆర్థికరంగ వృద్ధి గమనం తీరుతెన్నులపై అయిదు నెలలక్రితం రెండు పరస్పర విరుద్ధ అంచనాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది వృద్ధిరేటు ఏడు శాతానికి తగ్గబోదని ఆర్థిక సర్వే మదింపు వేయగా, దేశంలో మాంద్యం చిన్నెలు తొంగిచూస్తున్నాయని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక అప్పట్లో ప్రమాద ఘంటికలు మోగించింది. 'కాగ్' లెక్క తప్పలేదని కొన్నాళ్లుగా రుజువవుతూనే ఉంది.
దేశార్థికం ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు పలు అధ్యయనాలు, గణాంక విశ్లేషణలు చాటుతున్నా- కేంద్రప్రభుత్వం ఇన్నాళ్లూ భిన్నగళంతో స్పందించింది. సర్కారు ఇక ఎంతమాత్రం ధీమాగా పొద్దుపుచ్చే వీల్లేదని సరికొత్తగా విడుదలైన అధికారిక గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి.
కళ్లెదుట వాస్తవాలు....
తయారీ, గనులు, విద్యుదుత్పత్తి రంగాల్లో పేరుకున్న నిస్తేజం మూలాన వరసగా మూడో నెలా దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐపీపీ) కుంగుదలను కళ్లకు కడుతోంది. ప్రధానంగా కంప్యూటర్, ఎలెక్ట్రానిక్, ఆప్టికల్ ఉత్పత్తులు, వాహనాల తయారీకి సంబంధించి 30శాతం మేర ప్రతికూల (మైనస్) వృద్ధిరేటు కలవరపరుస్తోంది! 2014 నుంచీ ద్రవ్యోల్బణం రేటు పెరగనే లేదని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ మొన్న సెప్టెంబరులో దిలాసాగా ప్రకటించారు.
నవంబరు మాసంలో అయిదున్నర శాతానికి పైబడిన రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరి ఉరుముతోంది. అందులోనూ ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం పది శాతానికి మించి వినియోగదారుల్ని హడలెత్తిస్తోంది! సుమారు ఆరేళ్ల క్రితం రెండంకెల ద్రవ్యోల్బణం రెచ్చిపోతున్న వేళ మాంద్యం కోర సాచింది. ఇప్పుడు ఇంచుమించు అటువంటి పరిస్థితే పునరావృతమవుతూ, నిరుద్యోగిత విజృంభించడం- దేశం స్తబ్ధోల్బణం (స్టాగ్‌ఫ్లేషన్) ముప్పు ముంగిట ఉందనడానికి సూచికగా జాతిని భీతిల్లజేస్తోంది.
ముమ్మరిస్తున్న సంక్షోభం...
'దేశంలో ఆర్థిక మాంద్యం లేదు... రాబోదు!'- ద్రవ్యరంగ స్థితిగతులపై పక్షం రోజుల క్రితం రాజ్యసభాముఖంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందన అది. పోనుపోను ముమ్మరిస్తున్న సంక్షోభం ఉనికినే ఆర్థికమంత్రి గుర్తించ నిరాకరించడం ఎందరినో విస్మయపరచింది. తొలుత సమస్య తీవ్రతను సరిగ్గా మదింపు వేస్తేనే పరిష్కారాన్వేషణ, తగిన దిద్దుబాటు చర్యలు సాధ్యపడతాయి. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నరు రఘురాం రాజన్ వివరణాత్మక సూచనలు ఆ వాస్తవిక స్ఫూర్తికే అద్దం పట్టాయి. యూపీఏ ఏలుబడి నుంచి మోదీ ప్రభుత్వానికి వారసత్వంగా సంక్రమించిన అయిదు సమస్యలు దేశార్థికానికి గుదిబండలుగా పరిణమించాయన్న ఆయన లోతైన విశ్లేషణ అర్థవంతమైనది.
అంతటా కమ్ముకున్న మాంద్యం...
అనుమతుల్లో ఎనలేని జాప్యం కారణంగా నిలిచిపోయిన మౌలిక వసతుల ప్రాజెక్టులు, పడకేసిన విద్యుదుత్పత్తి, మందగించిన రుణలభ్యత, తెరిపిన పడని సేద్యరంగం, రైతుకు కరవైన గిట్టుబాటు... ఆర్థికాన్ని పుంజుకోనివ్వలేదు. ఆపై సమర్థ విధాన నిర్ణయాలు కొరవడి ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు చతికిలపడి వస్తుసేవలపై ప్రజలు వెచ్చించే మొత్తం తెగ్గోసుకుపోయి మాంద్యం కమ్ముకుంది. ప్రభుత్వ రెవిన్యూ అంచనాలు తలకిందులై, రాష్ట్రాలు బడ్జెట్లనూ సవరించుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
వృద్ధిరేటు తేటపడటానికి విద్యుత్తు, బ్యాంకింగేతర రంగాల్లో సమస్యల్ని చురుగ్గా పరిష్కరించి, వెలుపలి పెట్టుబడుల్ని రాబట్టేలా దీర్ఘకాలిక సంస్కరణలు జోరెత్తాలని నిపుణులు హితవు పలుకుతున్నారు. పెట్టుబడుల సేకరణకు, ఉపాధి కల్పనకు అవతరించిన రెండు క్యాబినెట్ కమిటీలు ఏం చేస్తున్నాయో తెలియదు. బహుముఖ సవాళ్లు చుట్టుముడుతున్న తరుణంలో కేంద్రప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కించే వీల్లేదు.
ఏటా 8 శాతం వృద్ధితోనే అది సాధ్యం...
స్థిరమైన వృద్ధిరేటు సాధిస్తూ, పటిష్ఠ ఆర్థికమూలాలు కలిగిన ఇండియా 2028 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించగలదని రెండేళ్ల క్రితం బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ చెప్పిన జోస్యమిప్పుడు చెల్లని కాసు. వచ్చే అయిదేళ్లలో భారత్ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకోవాలన్న ఎన్‌డీఏ కల నిజం కావాలంటే- ఏటా ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు 4.3 శాతానికి పరిమితం కానుందన్న జపాన్ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ 'నొమురా' అంచనాల ప్రాతిపదికన, అదిప్పుడు చెదిరిన స్వప్నం!
ప్రభుత్వ చర్యల ప్రభావం అంతంతమాత్రమే...
తరతమ భేదాలతో విద్యుత్, స్థిరాస్తి, టెలికాం, బొగ్గు, విమానయానం తదితర రంగాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ప్రైవేటు రంగంలో చురుకు పుట్టించేందుకు ఉద్దేశించిన సెప్టెంబరు నాటి కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం, విశేష ఫలితాలు రాబట్టడంలో నెగ్గుకు రాలేకపోయింది. ఆర్థిక మందగమనాన్ని తిప్పికొట్టే పేరిట దఫాలవారీగా ప్రకటించిన చర్యలూ పెద్దగా ప్రభావాన్వితం కాలేదు. వృద్ధికి, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా దేశీయ పెట్టుబడులు, పారిశ్రామికోత్పత్తి, రుణవసతి... మూడింటిపైనా అర్థవంతమైన విధాన రచన అత్యావశ్యకమన్న సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) మునుపటి సిఫార్సు నేటికీ శిరోధార్యమే.
గ్రామీణ పరిశ్రమలు, విద్య, ఐటీ రంగాల్ని పరిపుష్టీకరించి వ్యవసాయాన్ని తేజరిల్లజేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మాంద్యం పీడకు అదే సరైన విరుగుడు! ముప్పు జాడల్ని ముందుగానే పసిగట్టి రిజర్వ్ బ్యాంక్ ఏడాది క్రితమే రెపో రేటు (దేశీయంగా ద్రవ్య సరఫరాను నిర్దేశించే ప్రాతిపదిక)లో సరైన మార్పులు చేసి ఉండాల్సిందన్న ఇటీవలి విశ్లేషణలు, చేజారిన అవకాశాల్ని ప్రస్ఫుటీకరించాయి. దేశార్థికానికి మరిన్ని కష్టనష్టాలు వాటిల్లకుండా ఇకనైనా సత్వర సమగ్ర దిద్దుబాటు చర్యలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి!