వనాలు నరికేసి మనం ఇళ్లు కట్టేసుకున్నాం. దీంతో అడవిలోని జంతువులకు ఆహార కొరత ఏర్పడింది. అన్ని జంతువులు ఎలాగోలా సర్దుకుంటున్నాయి కానీ, వానరాలు మాత్రం మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పొలాల్లో పడి పంట నాశనం చేస్తాయి. అంతే కాదు, ఇళ్లల్లోకి దౌర్జన్యంగా చొరబడి.. వాటికి నచ్చిన ఆహారాన్ని గిన్నెలు, డబ్బాలతో సహా ఎత్తుకెళతాయి. అడ్డొస్తే ఇకిలించి భయపెడతాయి. ఇంకా ఎక్కువ చేస్తే మనుషులని కూడా చూడకుండా రక్కేస్తాయి. అందుకే, కోతుల అరాచకాలను భరించలేక కర్ణాటక ప్రభుత్వం.. వాటి కోసం ప్రత్యేక పార్కు ఏర్పాటు చేసింది.
కోతుల పోరు తాళలేక...
శివమొగ్గ జిల్లా, మలెనాడ్ ప్రజలు కోతుల పోరు తగ్గించమని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించింది. వాటికి ఆహారం దొరక్కే ఇళ్లపైకి, పంటల్లోకి వస్తున్నాయి. అదే ఆహారం వాటికి సరిపడా దొరికితే.. వాటి మానాన అవి గడుపుతాయి అనుకుంది. అందుకే, కపిరాజుల కోసం రూ. 5 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక పార్కు నిర్మించింది.
కపిరాజుల పార్క్...
కోతులు ఆహారం కోసం కష్టపడాల్సిన పని లేకుండా.. వాటిని తీసుకొచ్చి ఈ పార్కులో పెడతారు. ఇక్కడుండే బోలెడన్ని చెట్ల ఫలాలు, నిర్వాహకులు పెట్టే ఆహారంతో కడుపు నింపుకుంటాయి. అయితే, ఓ చోట పెట్టినంత మాత్రాన కోతులను కట్టడి చేయలేమని తెలిసే... హోసానగర్ తాలూకా, నిట్టూరు గ్రామంలో శరవతి నది పక్కన ఈ పార్కు నిర్మించారు. మూడు పక్కలా నీరు ఉంటుంది కాబట్టి ఆ నీటిని దాటి కోతులు జనావాసాల్లోకి వెళ్లలేవు. దీంతో కోతుల సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు.
దేశంలో అసోం, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ ఇలాగే జనంతో పోరాడి.. ప్రభుత్వాలతో పార్కు కట్టించుకున్నాయి కోతులు! ఇప్పుడు కర్ణాటక శివమొగ్గలో ఈ మూడో అతిపెద్ద కోతుల పార్కు ఏర్పాటైంది. భవిష్యత్తులో ఈ పార్కు పర్యటక ప్రదేశంగా మారనుంది. ప్రస్తుతం వానర పార్కు నిర్మాణం పూర్తయింది.. త్వరలో ప్రారంభంకానుంది.
ఇదీ చదవండి:'భారతీయ మహిళలకు వైరస్ ముప్పు అధికం'