లాక్డౌన్ కారణంగా ప్రజలకు నిత్యావసర సరకుల కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఆవాసాలు, కాలనీల్లోని చిన్న దుకాణాలకు కేంద్రం అనుమతించింది. జాగ్రత్తలు పాటిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన మహారాష్ట్రలో మాత్రం మే 3 వరకూ లాక్డౌన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం ఇచ్చిన అనుమతులపై అనేక సందేహాలున్నాయన్నారు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే. ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు.
గుజరాత్లో...
గుజరాత్‌లోనూ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో రెడ్ జోన్లుగా ఉన్న అహ్మదాబాద్ కార్పోరేషన్ పరిధిలోని 6 వార్డుల్లో దుకాణాలు తెరిచేందుకు నగరపాలక సంస్థ నిరాకరించింది. మిగతా ప్రాంతాల్లో ఆంక్షలను సడలించి, దుకాణాలకు షరతులతో కూడిన అనుమతులిచ్చింది.
మమత నిర్ణయం కోసం
బంగాల్లో దుకాణాలకు అనుమతులు ఇచ్చే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఈ అంశంపై మమత సర్కారు ఓ నిర్ణయానికి రానున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్‌లో దుకాణాలు తెరుచుకోవడం వల్ల వివిధ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి కనిపించింది. అయితే, హాట్స్పాట్లుగా ఉన్న ఇండోర్, భోపాల్, ఉజ్జెయిన్, జబల్పూర్ నగరాల్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలకు అనుమతినిచ్చే అంశంపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వనుందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
దేశ రాజధానిలో..
కేంద్రం అనుమతుల మేరకు ఆవాసాలు, కాలనీల్లోని చిన్న దుకాణాలు తెరిచేందుకు దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ జోన్లలోని దుకాణాలకు షరతులపై అనుమతించింది. రెడ్జోన్లలో యథాతథ స్థితి కొనసాగుతుందని ప్రకటించింది.
ఒడిశాలో..
ఒడిశాలో వ్యవసాయం, పరిశ్రమలు సహా వివిధ రంగాలకు చెందిన సుమారు 86 వేల మంది కార్మికులు తమ పనులకు హాజరయ్యేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. పని ప్రదేశాలకు కార్మికుల తరలింపులో యాజమాన్యాలు సరైన జాగ్రత్తలు, వ్యక్తిగత దూరం పాటించేలా చూడాలని సూచించింది.
వలస కూలీలు స్వరాష్ట్రానికి..
లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వలస కూలీలను విడతల వారీగా స్వరాష్ట్రానికి తీసుకురావాలని యోగి సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే హరియాణాలో ఉన్న 2,224 మందిని 82 బస్సుల్లో యూపీకి చేర్చామన్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. మరో విడతలో 11 వేల మందిని తీసుకురానున్నట్లు ప్రకటించారు. వారంతా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'రాపిడ్ టెస్ట్ కిట్లతో కరోనా పరీక్షలు నిర్వహించవద్దు'