అక్టోబర్ 11న జరిగిన దుర్గాపూజా కార్నివాల్లో తనకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్. కార్యక్రమం కోసం ఆయనకు అందిన ఆహ్వానం, కేటాయించిన సీటు తదితర అంశాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకుల చర్యతో తాను చాలా బాధపడ్డానన్నారు.
"నాకు చాలా బాధకలిగించిన విషయం ఏంటంటే.. నన్ను చూసిన తీరు. నాలుగు గంటలకంటే ఎక్కువసేపు నేను అక్కడ వేచి ఉన్నాను. ఎన్నో లైవ్ ఈవెంట్లు జరుగుతున్నా... నేను ఒక్కటి కూడా చూడలేకపోయాను. ఆ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. నన్ను కించపరచాల్సిన అవసరం ఏమొచ్చింది. రాష్ట్ర ప్రజలు ఎవరూ దీన్ని ఆమోదించరు. నేను బాధపడితే వారూ చింతిస్తారు. ఎవరు, ఎందుకు ఇలా చేశారో నాకు తెలియదు. ఈ విషయాన్ని వాళ్లైనా వివరించాలి.. లేక మీడియానే కనుగొనాలి."
- జగ్దీప్ ధన్కర్, బంగాల్ గవర్నర్
అయితే ఏ విషయం ఆయనను ఇంతలా బాధించిందో గవర్నర్ స్పష్టంగా చెప్పలేదు. ఎన్ని అవరోధాలు కల్పించినా.. తనను బాధ్యతలు నిర్వర్తించకుండా ఎవరూ ఆపలేరన్నారు.
శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు.. గవర్నర్కు ఒక వరుసలో చివర సీటును కేటాయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పలువురు మంత్రులు హాజరయ్యారు. బంగాల్లో హింస చెలరేగుతోందంటూ కొద్ది రోజుల క్రితం గవర్నర్ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది.