రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని అమరీందర్ అన్నారు. ఎప్పుడో పరిష్కరించాల్సిన సమస్యను మరింత ఆలస్యం చేస్తూ.. 12 రౌండ్ల చర్చల వరకూ తీసుకెళ్లిందని ఆరోపించారు. మొదటి దఫా చర్చల్లోనే రైతుల డిమాండ్లకు ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రైతులు.. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లి నూతన సాగు చట్టాలపై సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
'అది పాక్ కుట్రే!'
కొందరు వ్యక్తులు రైతు ఉద్యమంలోకి ప్రవేశించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట, దిల్లీ పరిసర ప్రాంతాల్లో హింసకు కారకులయ్యారని పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఆందోళనల కారణంగా రైతు ఉద్యమం.. ఉనికి కోల్పోయిందని చెప్పారు. దేశంలో అవాంతరాలు సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు అమరీందర్. దేశ స్వతంత్రానికి, ప్రజాస్వామ్యానికి ఎర్రకోట ప్రతీకగా నిలుస్తుందన్న ఆయన.. జనవరి 26న జరిగిన హింసాకాండ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి చెందానని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు బాధ్యత వహించాలని తెలిపారు.
ఆ 'స్థానికులు' ఎవరో తేల్చండి..
దిల్లీ శివారులోని సింఘు సరిహద్దులో శుక్రవారం పటిష్ఠంగా ఉన్న భద్రతను సైతం దాటడుకొని రైతులపైన, వారి ఆస్తులపైన దాడులు చేసిన 'స్థానికులు' ఎవరో విచారణ ద్వారా కేంద్ర ప్రభుత్వం తేల్చాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కోరారు. స్థానిక ప్రజలు.. రైతులపై తిరగబడతారంటే తాను నమ్మబోమని అన్నారు. వాళ్లు కచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని, స్థానికులైతే రైతులను ద్రోహులుగా పిలవరని చెప్పారు అమరీందర్. రైతు చట్టాలపై జరుగుతున్న ఈ ఆందోళనలు అడ్డుపెట్టుకుని పంజాబ్లో శాంతిని భంగపరిచేందుకు పాకిస్థాన్ ఎదురుచూస్తోందని తాను చాలాకాలంగా హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయినప్పుడు కూడా ఇదే విషయమై తాను మాట్లాడినట్టు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: దిల్లీలో మరోసారి రైతుల నిరాహార దీక్ష