కేంద్రం తమకు తాజాగా పంపిన లేఖలో కొత్త అంశాలేమీ లేవని రైతు సంఘాల నాయకులు తెలిపారు. సాగు చట్టాల సవరణలపై ప్రతిపాదనల గురించి చర్చించేందుకు తేదీలు చెప్పాలనే మళ్లీ కోరినట్లు వెల్లడించారు.
కొత్త చట్టాలపై ఆమోదయోగ్య పరిష్కారం చూపుతామని హామీ ఇస్తే కేంద్రంతో చర్చలు జరిపేందుకు తాము ఎల్లవేళలా సిద్ధమేనని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికైత్ తెలిపారు. కానీ, వ్యవసాయ శాఖ ఆదివారం తమకు పంపిన లేఖలో మళ్లీ సాగు చట్టాల సవరణలపై మాత్రమే ప్రస్తావించిందని పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చలు జరిపేందుకే తేదీలు అడిగిందని వివరించారు. దీనిపై తామంతా చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
'ప్రభుత్వానికి మా డిమాండ్ ఏంటో తెలియదా? సాగు చట్టాల రద్దే మేం కోరుకుంటున్నాం' అని మరో రైతు సంఘం నాయకుడు అభిమన్యు కోహర్ స్పష్టం చేశారు.