మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు.
నాగ్‌పుర్ మహల్ ప్రాంతంలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మంగళవారం రాత్రి చేరుకున్న ఫడణవీస్ సుమారు గంటన్నరపాటు భగవత్‌తో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య జరిగిన సంభాషణపై ఎలాంటి స్పష్టత లేనప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ అనిశ్చితిపైనే చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అంతకుముందు రాష్ట్ర భాజపా సీనియర్ నేత, ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్.. ప్రభుత్వ ఏర్పాటుపై అతి త్వరలో శుభవార్త వింటారని పేర్కొన్నారు. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం ఏర్పాటు కావచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్‌తో ఫడణవీస్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
పట్టు వీడని సేన..
భాజపా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేపట్టినప్పటికీ.. భాగసామ్య పార్టీ శివసేన చెరిసగం పాలన (50:50 ఫార్ములా)పై పట్టు వీడటం లేదు. భాజపా నుంచి లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి సేన నుంచే ఉంటారని ఉద్ఘాటించారు.
ఇదీ చూడండి: శుభవార్త అంటున్న భాజపా- వెనక్కి తగ్గని సేన