భారత్‌లో అధికార భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలతో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది ఫేస్‌బుక్. వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన కథనంతో అధికార పార్టీపై కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై స్పందించింది సామాజిక మాధ్యమ దిగ్గజం. ద్వేషపూరిత సంభాషణలు, హింసను ప్రేరేపించే భావజాలాన్ని నిషేధించటమే కాదు.. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తమ విధానాలు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నాయని స్పష్టం చేసింది. అయితే.. ఈ అంశంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని అంగీకరించింది.
ఫేస్‌బుక్‌పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగిన నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చింది సంస్థ.
" ద్వేషపూరిత సంభాషణలు, హింసను ప్రేరేపించే సమాచారాన్ని నిషేధించాం. ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండకుండా మా విధానాలను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. అయినా.. ఈ అంశంలో చాలా చేయాల్సి ఉందని మాకు తెలుసు. ఈ విధానాల అమలులో పురోగతి సాధించాం. సమాచార కచ్చితత్వాన్ని నిర్ధరించడానికి క్రమంగా ఆడిట్ నిర్వహిస్తున్నాం.
- ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి
దర్యాప్తునకు సీపీఎం డిమాండ్
ద్వేషపూరిత సంభాషణల నియమాలను ఉల్లంఘించిన భాజపా నేతలపై ఫేస్‌బుక్ చర్యలు తీసుకోవటంలో ఉద్దేశపూర్వకంగా విఫలమైందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది సీపీఎం. తాజా వ్యవహారంతో సామాజిక మాధ్యమంలో అధికార పార్టీ పెట్టుబడులు ఉన్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. భాజపా, ఫేస్‌బుక్ మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించటాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: ఫేస్‌బుక్ టార్గెట్- కాంగ్రెస్, భాజపా మాటల యుద్ధం