ఈ ఏడాది ఆగస్టులో దేశంలోని సగానికి పైగా ప్రాంతాల్లో సాధారణం కంటే 15 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వరుసగా రెండో నెలలోనూ ఎక్కువ వర్షాలు కురిసినట్లు తెలిపింది.
1951-2000 మధ్య కాలంలోని వర్షపాతాన్ని దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)గా కొలుస్తారు. అది 89 సెంటీమీటర్లుగా ఉంది. ఎల్పీఏతో పోలిస్తే.. జూన్ నెలలో 87 శాతం లోటు వర్షపాతం ఉంది. కానీ జులైలో 109 శాతం, ఆగస్టులో 115 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
ఆగస్టులో దేశ వ్యాప్తంగా 26 శాతం ప్రాంతాల్లో అత్యధికం, 22 శాతం ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవగా.. 23 శాతం ప్రాంతాల్లో సాధారణం, 29 ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉంది.
రాష్ట్రాల వారిగా...
దక్షిణ భారత్లో జులైలో 56 శాతం, ఆగస్టులో 38 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువ వర్షాలు కురిశాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి.
తూర్పు, ఈశాన్య రాష్ట్రాలలో 38 శాతం, వాయువ్య రాష్ట్రాలలో ఒక శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది.
సెప్టెంబర్లో సాధారణం...
సెప్టెంబర్లో వర్షపాతం సాధారణంగానే ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.