దేశీయంగా తయారు చేస్తున్న రెండు కరోనా వ్యాక్సిన్ల మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ అత్యంత సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే రాజ్యసభలో మంగళవారం వెల్లడించారు. కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ సహా భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా తయారు చేస్తున్న క్యాండిడేట్ వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచినట్లు తెలిపారు. ప్రస్తుతం వీటిపై రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ల పనితీరుపై రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు సదరు మంత్రి. ఐసీఎంఆర్ నేతృత్వంలో 14 క్లినికల్ ట్రయల్ కేంద్రాల్లో రెండో, మూడో దశ పరీక్షలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చెన్నైలోని క్షయవ్యాధుల నేషనల్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ప్రధాన కేంద్రంగా ట్రయల్స్ జరుగుతున్నట్లు వెల్లడించారు.
సమర్థవంతమైన టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగ సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయని... టీకా అభివృద్ధిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పూర్తి సమాచారం వెల్లడించటం కుదరదని అశ్విని చౌబే వెల్లడించారు.
కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో ప్రేమాస్ బయోటెక్, జెన్నోవా, మైన్వాక్స్, ఎపిజెన్ బయోటెక్, లక్స్మాత్రా ఇన్నోవేషన్స్, బయోలాజికల్ ఎవాన్స్, ఇతర సంస్థలు ప్రిక్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు తెలిపారు మంత్రి. దేశవ్యాప్తంగా 30 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ప్రయోగాలు జరుపుతున్నట్లు బయోటెక్నాలజీ విభాగం తెలిపిందని పేర్కొన్నారు. వీటిలో మూడు వ్యాక్సిన్లు తొలి, రెండో, చివరి దశలో ఉన్నాయని.. మరో 4కు పైగా వ్యాక్సిన్లు ప్రి క్లినికల్ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం ఐసీఎంఆర్ రూ.25 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.
అలాగే రష్యా అభివృద్ధి చేసిన టీకా ఉత్పత్తి సహకారంపై చర్చలు జరుగుతున్నాయని చౌబే చెప్పారు.