భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంతరిక్ష కార్యక్రమం చంద్రయాన్-2. మరికొన్ని గంటల్లో జాబిల్లి తలంపై విక్రమ్ ల్యాండ్ కానుంది. ఈ ప్రయోగం అంతా సజావుగా సాగుతోందని ప్రకటించారు ఇస్రో ఛైర్మన్ శివన్.
"మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అంతా ప్రణాళిక ప్రకారమే సాగుతోంది. మొట్టమొదటి సారి ఇలాంటి ప్రయోగం చేస్తున్న కారణంగా చంద్రయాన్-2 బృందం అందరిలో కచ్చితంగా ఉత్కంఠ ఉంటుంది."
- శివన్, ఇస్రో ఛైర్మన్
సెన్సర్లు, కంప్యూటర్లు, కమాండ్ సిస్టమ్స్ చక్కగా పనిచేస్తున్నాయని... జాబిల్లిపై ఉండే వాతవరణాన్ని సృష్టించి ప్రయోగాలు చేపట్టిన నేపథ్యంలో ప్రయోగం విజయవంతం కావడంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. చంద్రయాన్ ల్యాండింగ్ నవజాత శిశువును ఊయలలో ఉంచడం వంటిదన్నారు.
విక్రమ్ ల్యాండర్ తెల్లవారుజాము 1.30-2.30 నిమిషాల మధ్య ల్యాండ్ కానుంది. ప్రగ్యాన్ రోవర్ ఉదయం 5.30-6.30 నిమిషాల మధ్య విక్రమ్ నుంచి బయటకు రానుంది. తెల్లవారుజాము 1.10 నిమిషాల నుంచి ప్రయోగం లైవ్ ప్రసారం కానుంది.
చంద్రుడిపై ల్యాండర్ దిగే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రోలో ఉండనున్నారు. మోదీతో పాటు ఆన్లైన్ క్విజ్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులు ఇస్రోలో చంద్రయాన్‌ను వీక్షించనున్నారు.
మోదీ వరుస ట్వీట్లు...
చంద్రయాన్ ప్రయోగం విజయాన్ని కాంక్షిస్తూ వరుస ట్వీట్లు చేశారు ప్రధాని మోదీ. 130 కోట్ల మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, మన శాస్త్రవేత్తల పరాక్రమాన్ని ప్రపంచ దేశాలు మరోసారి చూడనున్నారని పేర్కొన్నారు. ఇస్రో క్విజ్‌లో గెలిచిన చిన్నారులతో కలిసి, జాబిల్లిపై దిగే ప్రక్రియను చూడనున్నాను అని వెల్లడించిన మోదీ... ఆ క్షణాలను ప్రజలు వీక్షించాలని... సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: ఇస్రో ఏం చేసినా ప్రత్యేకమే..!