కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనలు అధికమైన వేళ ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ కోసం పర్వతారోహకులకు అనుమతులను నిలిపివేసింది నేపాల్. ఇప్పటికే టిబెట్ నుంచి శిఖరాన్ని అధిరోహించేందుకు ఉన్న మార్గాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది చైనా. తాజాగా నేపాల్ కూడా ఎవరెస్ట్‌తో పాటు తమ దేశంలో ఉన్న అన్ని పర్వతాల అధిరోహణకు అనుమతులతోపాటు పర్యటక వీసాలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా తీవ్రతపై వచ్చే నెలలో సమీక్ష నిర్వహించి అనుమతిపై పునరాలోచిస్తామని తెలిపింది నేపాల్ పర్యటక శాఖ. ఎవరెస్ట్ పర్వతారోహణ ద్వారా నేపాల్ ఏటా లక్షలాది డాలర్లు ఆర్జిస్తోంది.
దేశంలో ఇంకా పలు కార్యక్రమాలు వాయిదా పడటమే కాక.. కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
సీఆర్పీఎఫ్ వార్షికోత్సవం వాయిదా
భారత్ విషయానికి వస్తే... కరోనా వైరస్ కారణంగా ఈనెల 19న నిర్వహించాల్సిన వార్షికోత్సవాన్ని వాయిదా వేసుకుంది సీఆర్పీఎఫ్. సుమారు 3.25 లక్షల మంది భద్రతా సిబ్బంది పాల్గొని పరేడ్‌లో తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంది. సీఆర్పీఎఫ్కు చెందిన అన్ని కార్యక్రమాలను నిలిపి వేస్తున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు అధికారులు.
ఒడిశాలో విద్యాసంస్థలు బంద్..
ఒడిశాలో అన్ని విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్‌లను ఈనెల 31వరకు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా కరోనాను ఎదుర్కొనేందుకు ఒడిశా ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసింది.
విద్యావ్యవస్థ, క్రీడారంగంపై ప్రభావం
దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం శుక్రవారం నుంచి అన్ని తరగతులను రద్దు చేసింది. ఈ నెల 31 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. అయితే అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది యథావిధిగా హాజరవ్వాలని సూచించింది.
ఐపీఎల్‌పైనా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020తో సహా అన్ని క్రీడలపై దిల్లీలో నిషేధం విధిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు.
ఇదీ చదవండి: వీసా ఆంక్షలపై సమాచారం కోసం అమెరికాలో హెల్ప్లైన్లు