'జమ్ము కశ్మీర్... ప్రత్యేక హోదా రద్దు' పూర్తిగా తమ అంతర్గత విషయమని భారత్ స్పష్టం చేసింది. ఈ అంశంలో ఎటువంటి వివాదం లేదని, ఇతర దేశాలు కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. చర్చలు ప్రారంభించడానికి ముందు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆపాలని గట్టిగా చెప్పింది. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రత మండలి రహస్య సమావేశం ముగిసిన నేపథ్యంలో భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది.
పాకిస్థాన్, చైనా అభ్యర్థన మేరకు ఐరాస భద్రత మండలి అనధికార రహస్య సమావేశం నిర్వహించింది. అయితే సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి.
"ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించడం పూర్తిగా భారతదేశ అంతర్గత విషయం. ఇందులో ఇతర దేశాలకు ఎలాంటి సంబంధం లేదు. "
"కశ్మీర్ విషయంలో భారత చర్యలను... ఐరాస భద్రత మండలి రహస్య సమావేశం అంగీకరించింది. ఇది సంతోషకరం."_ సయ్యద్ అక్బరుద్దీన్, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి
ఐరాస భద్రత మండలి అనధికార రహస్య సమావేశం ముగిసిన నేపథ్యంలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. చైనా, పాకిస్థాన్ రాయబారులు మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోవడం గమనార్హం.
భారత్, పాక్ ప్రతినిధులు నో ఛాన్స్
కశ్మీర్ అంశంపై 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలతో... ఐరాస భద్రత మండలి రహస్య సమావేశం నిర్వహించింది. భారత్, పాక్ ప్రతినిధులకు మాత్రం ఇందులో అవకాశం కల్పించలేదు. తమ ప్రతినిధి పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలన్న పాక్ అభ్యర్థనను మండలి తిరస్కరించింది.
ఐరాస రికార్డుల ప్రకారం.. యూఎన్ భద్రతామండలి... చివరిసారిగా కశ్మీర్ అంశంపై 1965లో చర్చించింది.
ట్రంప్‌తో మాట్లాడిన ఇమ్రాన్‌ఖాన్
ఐరాస భద్రతామండలి రహస్య సమావేశానికి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇమ్రాన్‌ఖాన్ ఫోన్లో మాట్లాడారు. భారత్-పాక్ ద్వైపాక్షిక చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: జైట్లీ ఆరోగ్యం విషమం!.. అమిత్ షా పరామర్శ