కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. దేశవ్యాప్తంగా పంపిణీ చేయటం సహా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు అధునాతన వ్యవస్థను వినియోగించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అందుకోసం దేశంలోని అన్ని కోల్డ్ చైన్స్‌లో స్టాక్, ఉష్ణోగ్రతలపై రియల్ టైంలో సమాచారం అందించే ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటిలిజెన్స్ వ్యవస్థ(ఈ-విన్)ను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు రాజ్యసభకు తెలిపారు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే.
కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు చౌబే. ఈ బృందం.. వ్యాక్సిన్ ఎవరికి ముందు ఇవ్వాలి, వ్యాక్సిన్ క్యాండిడేట్ల ఎంపిక, సరఫరా ప్రక్రియ, కోల్డ్ చైన్, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనుందని పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతం ఏ విదేశీ ఫార్మా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు చౌబే.
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం ఏదైనా రోడ్‌మ్యాప్‌ను రూపొందించిందా అని అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు చౌబే.
"వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, ఇతర పంపిణీ స్టేషన్లకు సరఫరా అవుతుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఈ-విన్ వ్యవస్థను ఆరోగ్య అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. వ్యాక్సిన్ అవసరాలు, ట్రాకింగ్ కోసం ఈ-విన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నాం. భారత్‌లో వ్యాక్సిన్ రూపొందిస్తున్న ఏడు సంస్థలకు ప్రీక్లినికల్ టెస్ట్, పరిశీలన, విశ్లేషణ కోసం అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) తెలిపింది. రెండు వ్యాక్సిన్ క్యాండిడేట్ల తొలిదశ ట్రయల్స్ మంచి ఫలితాలు ఇచ్చాయి. రెండో దశ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి."
- అశ్విని కుమార్ చౌబే, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి.
అందుకే ఆ వ్యూహాన్ని అనుసరించలేదు..
కరోనా కట్టడికి వైద్యపరంగా సరైన పరిష్కార మార్గాలు కనుగొనక ముందే ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ అభివృద్ధి చేసే ప్రయత్నాలు అనారోగ్యాలు, మరణాల పరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయన్నారు కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే. కరోనా తొలినాళ్లలో సహజసిద్ధ పద్ధతుల్లో హెర్డ్ ఇమ్యూనిటినీ పెంపొందించాలని ప్రయత్నించిన దేశాల్లో కేసులు, మరణాలు అధికంగా ఉన్నట్లు గుర్తుచేశారు. అందుకే ఆ వ్యూహాన్ని వదిలివేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. హెర్డ్ ఇమ్యూనిటీ కోసం రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయా అన్న ప్రశ్నకు.. కరోనా వ్యాప్తి గొలుసును విడగొట్టి కట్టడి చేసే వ్యూహాలపై అవసరమైన ప్రణాళిక, విధానం, మార్గదర్శకాలను రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: చైనాలో మరో వ్యాధి- వేల మందికి పాజిటివ్