ఎన్నికల బాండ్ల అంశంలో కేంద్రంపై విమర్శలు చేస్తున్న విపక్ష పార్టీల వైఖరిని తప్పుపట్టారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. వారిని 'ఎన్నికల్లో ఓటమిపాలై నిరాశ చెందిన అవినీతి రాజకీయ నాయకుల కూటమి'గా అభివర్ణిస్తూ.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల నిధుల్లో అవినీతి రహిత, పన్నులు చెల్లించే పారదర్శక నగదు తీసుకురావటం వారికి ఇష్టం లేదని విమర్శించారు.
"ఎన్నికల రాజకీయంలోకి ఎలక్టోరల్ బాండ్లు అవినీతి రహిత నగదును తీసుకొచ్చాయి. ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నవారు నల్లధనానికి అలవాటు పడ్డారు. ఎన్నికల సమయంలో నల్లధనాన్ని వినియోగించడాన్ని నమ్ముతారు."
- పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి.
ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ఎన్నికల్లో రూ.2 వేలకు పైగా నగదు విరాళాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు పీయూష్ గోయల్. గత ఎన్నికల సమయాల్లో కాంగ్రెస్ నాయకుల నుంచి కోట్ల రూపాయలు ఈసీ స్వాధీనం చేసుకుందని విమర్శించారు. నల్లధనానికి వ్యతిరేకంగా భాజపా మాత్రమే పోరాడుతోందన్నారు గోయల్. ఎన్నికల రాజకీయంలో అవినీతి రహిత, స్వచ్ఛమైన నగదును తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఎన్నికల బాండ్లపై కాంగ్రెస్ ఆందోళన- వెల్లోకి వెళ్లి నినాదాలు