పారిశ్రామిక పట్టణం బద్ధీలోని 'స్కాట్ ఎడిల్ ఫార్మాసియా' కంపెనీకి ఔషధాల తయారీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంస్థలో పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు వైశాలి. వాణిజ్యపరంగా ఎన్నో విజయాలు సాధించారు. మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. బాల్యం నుంచి ఔషధాల తయారీపై ఆసక్తి ఉన్న వైశాలి.. ఆ రంగాన్నే తన కెరీర్‌గా మలుచుకున్నారు. ఫార్మా విద్యలో మాస్టర్స్ చేశారు. ఔషధాల తయారీ సంస్థ 'స్కాట్ ఎడిల్'లో టెక్నికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ల్యాబ్‌ల ఏర్పాటు, సాంకేతిక అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో సంస్థ వ్యవహారాలన్నీ సమర్థంగా చక్కబెడుతున్నారు. రెండేళ్ల కిందట బద్ధీలో మరో యూనిట్ ఏర్పాటులో ఈమె పాత్ర ఉంది. శానిటైజర్ తయారీలో దేశంలో ఈ సంస్థకు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి ఉత్పత్తులు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి.
ఊహించని గిరాకీ
బద్ధీలోనే ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌తో శానిటైజర్ తయారుచేసే యూనిట్ ఉంది. 200 మందికి పైగా సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. సాధారణంగా నెలకు పదివేల శానిటైజర్ బాటిళ్లు తయారవుతాయి. ఫిబ్రవరిలో ఓ రోజు కార్యాలయంలో ఫోన్ మోగింది. శానిటైజర్లన్నీ అమ్ముడైపోయాయని, వెంటనే మరిన్ని కావాలని వచ్చిన ఆ ఫోన్ కాల్‌తో యుద్ధప్రాతిపదికన శానిటైజర్ల ఉత్పత్తిని పెంచేశారామె. 'అప్పటికింకా కరోనా విజృంభణ మొదలవ్వలేదు. వైరస్ కట్టడికి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. ఇందులో భాగంగా శానిటైజర్ వాడాలని అందరిలో అవగాహన వచ్చింది. దాంతో వాటికి ఊహించని గిరాకీ పెరిగింది. ప్రజావసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి పెంచాం. కార్మికులు మూడు షిఫ్ట్‌లుగా పని చేస్తున్నారు. ఆర్డర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇతర ఔషధాల తయారీ తగ్గించి.. శానిటైజర్ల ఉత్పత్తి పెంచాం. ఒక్క నెలలోనే 15 లక్షల బాటిళ్లు అమ్ముడయ్యాయి. తయారీకయ్యే ఖర్చు కన్నా.. తక్కువ ధరకే విక్రయిస్తున్నాం. నష్టం వచ్చినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజానికి కొంతైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ధరలు తగ్గించామ'ని చెబుతున్నారు వైశాలి. బద్ధీలోని యూనిట్ సమీప ప్రాంతాన్ని ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించింది. ఈ నెల 12న అక్కడి యూనిట్‌ను మూసేశారు. చండీగఢ్‌లో ఉన్న మరో యూనిట్ ద్వారా శానిటైజర్లు ఉత్పత్తి చేస్తున్నామంటున్నారు వైశాలి.