ఆసక్తి ఉన్న ప్రత్యేక పాఠ్యాంశాలను లోతుగా అధ్యయనం చేసే అవకాశాన్ని ఇస్తూనే, విద్యార్థులు నిండుగా ఎదగడానికి పునాది వేయాలని కొత్త జాతీయ విద్యావిధానం లక్షిస్తోంది. విద్యార్థుల్లో నైతిక విలువలు, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధతను పెంపొందించడం, కొత్త విషయాలపై కుతూహలాన్ని ఏర్పరచడం, సేవాభావాన్ని పాదుగొల్పడం, సైన్స్ టెక్నాలజీతోపాటు సామాజిక, మానవ శాస్త్రాలు, కళలు, వృత్తివిద్య, సాంకేతిక శిక్షణ కోర్సుల్లో 21వ శతాబ్ది నైపుణ్యాలను, విజ్ఞానాన్ని అలవరచడం ద్వారా జ్ఞానాధారిత మానవ వనరులను తయారు చేసుకోవడానికి అనువుగా ఈ విద్యావిధానాన్ని సిద్ధం చేశారు. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక శక్తుల్లో భారత్ ఒకటిగా ఎదగడానికి ఈ విధానం ప్రాతిపదికను ఏర్పరుస్తుంది. అందులో భాగంగా వైవిధ్యభరితమైన పాఠ్య ప్రణాళికలను బోధించే కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో పటిష్ఠ ఉన్నత విద్యావ్యవస్థను సిద్ధం చేసుకోవాలని డాక్టర్ కె.కస్తూరి రంగన్ నేతృత్వంలోని సంఘం సమర్పించిన ముసాయిదా మార్గనిర్దేశం చేసింది.
ప్రవేశాల పెంపుదల
దేశంలోని ఉన్నత విద్యాసంస్థలన్నీ ఇకపై పరిశోధన విశ్వవిద్యాలయాలు, బోధన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు (టైప్ 1, 2, 3)గా వర్గీకృతమై సాధికార ధ్రువీకరణ (అక్రెడిటేషన్) పొందుతాయి. వేలాది విద్యార్థులను చేర్చుకుని; మౌలిక వసతులు, వనరులను సమర్థంగా వినియోగించి; పరిశోధన, బోధన, సేవానిరతిని మేళవించి, 21వ శతాబ్దికి తగిన విద్యాలయాలుగా రాణించగలగాలి. 2032కల్లా అన్ని డిగ్రీలు, డిప్లొమాలను జారీచేసే హక్కు ఈ మూడు రకాల ధ్రువీకృత విద్యాసంస్థలకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న కళాశాలలు 2032కల్లా స్వయంప్రతిపత్తితో డిగ్రీలు ప్రదానం చేసే కళాశాలలు (టైప్3)గా రూపాంతరం చెందాలి. లేదా మూల విశ్వవిద్యాలయంలో విలీనం కావాలి. అదీ కాకుంటే స్వయంగా విశ్వవిద్యాలయాలుగా ఎదగాలి.
2020 నుంచి ప్రారంభమయ్యే అన్ని కళాశాలలు స్వయం నిర్ణయాధికారం ఉన్న టైప్ 3 కళాశాలలుగా ఎదగాల్సిందే. కొత్త అనుబంధ కళాశాలలను అనుమతించరు. 2032కల్లా అసలు అనుబంధ కళాశాలలే ఉండవు. సరికొత్త ఉన్నత విద్యావ్యవస్థలో వృత్తివిద్య అంతర్భాగంగా ఉంటుంది. కేవలం వృత్తివిద్య కోసమే విశ్వవిద్యాలయాలను నెలకొల్పే పద్ధతికి స్వస్తి చెబుతారు. ప్రస్తుతం వృత్తివిద్య, సాధారణ విద్యాబోధనలకు విడివిడిగా ఉన్న సంస్థలన్నీ 2030కల్లా రెండు తరహాల విద్యనూ అందించే సంస్థలుగా మారాలి.
ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలను 50 శాతం పెంచాలని జాతీయ విద్యావిధానం లక్షిస్తోంది. ప్రస్తుతం దేశంలో నలభై వేల పైచిలుకు విద్యాసంస్థలు ఉన్నాయి. కొత్త విధానం కింద వీటిని 150-300 టైప్1 (పరిశోధన) విశ్వవిద్యాలయాలుగా, 1,000-2,000 బోధన విశ్వవిద్యాలయాలుగా, 5,000-10,000 కళాశాలలుగా కుదించాల్సి ఉంది. బహుశా మూడు రకాల విద్యాసంస్థలన్నీ కలిపి 12 వేలకు మించకపోవచ్చు. ప్రస్తుతం 40 వేల విద్యాసంస్థలు ఉండి కూడా స్థూల ప్రవేశాల రేటు 25 శాతం దాటలేదు. రేపు విద్యాసంస్థలు మూడోవంతుకు తగ్గిపోయాక 50 శాతం ప్రవేశాలను అందుకోవడమెలా సాధ్యం? నేడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో కళాశాలలు నెలకొని స్థానిక కుటుంబాల్లో మొదటిసారి ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారికి, ముఖ్యంగా బాలికలకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. కొత్త విద్యావిధానం కింద ఈ కళాశాలలన్నీ స్వయంప్రతిపత్తి గల విద్యాసంస్థలుగా మారి, ఉన్నత నాణ్యతా ప్రమాణాలను పాటించి అక్రెడిటేషన్ పొందాలి. ఈ పరామితులను పాటించలేక గ్రామీణ, చిన్న పట్టణ కళాశాలలు అనేకం అంతర్ధానం కావచ్చు. అలాంటప్పుడు అందరికీ ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమా?
స్వయం నిర్ణయాధికారం లేకపోవడం వల్ల బోధన సిబ్బందికి చొరవ, ప్రేరణలు లోపించి, నవీకరణ సాధించలేకపోతున్నారని విద్యావిధాన ముసాయిదా వ్యాఖ్యానించింది. విద్యాసంస్థల యాజమాన్యాలూ నవీకరణ పథంలో సాహసికంగా ముందడుగు వేయలేకపోతున్నాయని పేర్కొంది. కానీ, ఇది సత్యదూరమని చెప్పకతప్పదు. ఇప్పుడున్న విశ్వవిద్యాలయ వ్యవస్థలో విద్యాసంస్థలకు, వాటి నిర్వాహకులకు, బోధన సిబ్బందికి సొంతగా పాఠ్య ప్రణాళికలు, కోర్సులు, ఇతర కార్యక్రమాలను రూపొందించి అమలుచేసే స్వేచ్ఛ ఉంది. మారుతున్న కాలానికి తగినట్లుగా పాఠ్య ప్రణాళికల్లో, కోర్సుల్లో మార్పులు చేయాలన్న ఆసక్తి, నిబద్ధత మాత్రం వారిలో కనబడటం లేదు. అనుకున్న పాఠ్యప్రణాళికను సక్రమంగా అమలు చేయాలన్న శ్రద్ధ కూడా లోపించింది. అనుబంధ కళాశాలలకూ సొంతంగా కోర్సులు, పాఠ్య ప్రణాళికలను రూపొందించుకునే స్వేచ్ఛ ఉండాల్సిందే. కానీ, వాటిని రూపొందించగల బోధన సిబ్బందికి మాత్రం ఎప్పుడూ కొరతే!
విద్యార్థులకు ఆర్థిక అండ
ఆర్థిక స్థోమత లేక ఏ విద్యార్థీ మధ్యలోనే చదువు ముగించాల్సిన అగత్యం రాకూడదని ముసాయిదా ఉద్ఘాటించింది. ఇందుకోసం జాతీయ ఉపకార వేతననిధి ఏర్పాటు చేయాలన్నది. ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు సర్కారు అండదండలతో విద్యార్థులకు ఆర్థిక దన్ను ఇవ్వగలవు కానీ, ప్రైవేటు సంస్థలు ముసాయిదా ఆశిస్తున్న స్థాయిలో ఉపకార వేతనాలు కాని, ఫీజుల మినహాయింపు కాని ఇవ్వలేవు. పోనీ స్థోమత ఉన్నవారి నుంచి ఎక్కువ రుసుములు వసూలు చేసి, పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుద్దామన్నా- గ్రామీణ, చిన్న పట్టణాల్లోని విద్యాలయాలకు అదికుదరని పని.
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులతోపాటు లిబరల్ ఆర్ట్స్ కోర్సులనూ అందించి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలని విద్యావిధాన ముసాయిదా పేర్కొంది. ఆర్ట్స్, హ్యుమానిటీస్, సైన్సు, గణితం, సామాజిక శాస్త్రాలను లిబరల్ ఆర్ట్స్ కోర్సులుగా వ్యవహరిస్తున్నారు. వీటికితోడు అన్ని డిగ్రీ కోర్సుల్లో భాషాపరమైన కోర్సులకూ ప్రాధాన్యమివ్వాలని ముసాయిదా సూచించింది. మారుతున్న కాలానికి తగిన విజ్ఞానాన్ని యువతకు అందించడానికి ఇది తోడ్పడుతుంది. డిజిటలీకరణ, స్వయంచాలనం (ఆటోమేషన్) వల్ల నేడు పరిశ్రమలు, కంపెనీల్లో సిబ్బంది స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. దీర్ఘకాలిక ఉద్యోగాలకు బదులు స్వల్పకాల కాంట్రాక్టులపై పనిచేయడం ఎక్కువవుతోంది. స్మార్ట్ ఆటోమేషన్, కృత్రిమ మేధల సాయంతో కంప్యూటర్లకు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సత్తా లభిస్తుంది. దీనివల్ల పెద్దగా నైపుణ్యం అక్కర్లేని ఉద్యోగాలకు ఎసరొచ్చి, ఉపాధి అవకాశాలకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ప్రతిభావంతులు మాత్రమే వృత్తిఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణించగలుగుతారు. యువతరంలో ఈ నైపుణ్యాలను వృద్ధి చేయడంలో సైన్స్, టెక్నాలజీలతోపాటు లిబరల్ ఆర్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
లోకజ్ఞానానికి ప్రాధాన్యం
విద్యార్థులను తరగతి గదుల్లో సిద్ధాంత బోధన, అభ్యాసాలకే పరిమితం చేయకుండా బయటి ప్రపంచంలో ఆచరణకు పంపాలని కొత్త విద్యావిధానం నిర్దేశిస్తోంది. ప్రయోగశాలలు, క్షేత్ర కార్యక్రమాలు, కార్యశాలలు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన ప్రాజెక్టుల ద్వారా సిద్ధాంతాన్ని, ఆచరణను మేళవించే అవకాశాన్ని విద్యార్థులకు ఇవ్వాలన్నది ఉద్దేశం. సామాజిక వాస్తవాల మధ్య విద్యార్థి విజ్ఞాన సముపార్జన చేయాలి. జాతీయ విద్యా విధానం ముసాయిదా రెండు రకాల డిగ్రీ కార్యక్రమాలను ప్రతిపాదించింది. ఒకటి- లిబరల్ ఆర్ట్స్‌లో నాలుగేళ్ల డిగ్రీ కార్యక్రమం, మరొకటి మూడేళ్ల డిగ్రీ కార్యక్రమం. ప్రపంచమంతటా విశ్వవిద్యాలయాలు, మూడు, ఆరు నెలల నానో కోర్సులు ప్రవేశపెట్టాలని యోచిస్తున్న తరుణంలో ఈ నాలుగు, మూడేళ్ల డిగ్రీ కోర్సుల ఆవశ్యకత, ఆచరణీయతపై సందేహాలు ముసురుతున్నాయి. ఉన్నత పాఠశాల చదువు ముగించుకున్నాక పనిలో చేరి, దాని అవసరాలకు తగ్గ నానో కోర్సులు నేర్చుకుంటూ, ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటూ జీవితంలో పురోగమించే వీలుండాలి.
కాంట్రాక్టు పద్ధతిపై తాత్కాలిక బోధన సిబ్బందిని నియమించే పద్ధతికి స్వస్తి చెప్పి, పూర్తికాల ఉద్యోగాల్లో నియమించాలని ముసాయిదా కోరింది. 2030కల్లా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇదే పద్ధతి చేపట్టాలన్నది. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలని నిర్దేశిస్తోంది. కానీ, అనేక కోర్సుల్లో సుశిక్షిత బోధన సిబ్బంది కొరత ఉన్నందువల్ల ముసాయిదా సూచనలు కార్యరూపం ధరించే పరిస్థితి లేదు. పరిశ్రమలు, ప్రభుత్వ శాఖల నిపుణులను రప్పించి, తరగతి గదులు నిర్వహిస్తే అధ్యాపకుల కొరతను చాలావరకు అధిగమించి, నాణ్యమైన బోధనను అందించవచ్చు. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల అజమాయిషీకి జాతీయ ఉన్నత విద్యానియంత్రణ సంస్థను ఏర్పరుస్తారు. అది వృత్తివిద్యా సంస్థలనూ నియంత్రిస్తుంది. ఉన్నత విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఎలాంటి నియంత్రణాధికారాలు ఉండవని ముసాయిదా స్పష్టం చేసింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణాధికారాలను హరించడం రాజ్యాంగపరంగా చిక్కులకు దారితీస్తుంది. మొత్తంమీద 2019 జాతీయ విద్యావిధాన ముసాయిదా ఉన్నత విద్యలో సమూల మార్పులు ప్రతిపాదించినా, అవి ఈనాటి అవసరాలకు అనుగుణంగా లేవని చెప్పాలి. నేడు అశేష విద్యార్థి లోకానికి అంతర్జాలంలో విద్యాబోధన జరుగుతోంది. కొత్త కాలానికి కొత్త మార్పులు తీసుకురావాలన్న స్పృహ జాతీయ విద్యావిధాన ముసాయిదాలో లోపించింది.
- డాక్టర్ టి.సిద్ధయ్య
(రచయిత- మాజీ రిజిస్ట్రార్, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం)