భారీస్థాయిలో నగదును అక్రమంగా చలామణి చేశారన్న ఆరోపణలపై బడా హవాలా డీలర్ నరేశ్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు అధికారులు.
దాదాపు 550 డొల్ల కంపెనీలను, కనీసం 940 అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను, రూ.1.07 లక్షల కోట్ల లావాదేవీలను ఈ కేసులో ఈడీ పరిశీలిస్తోంది. దేశంలో అతిపెద్ద హవాలా కేసుల్లో ఇదొకటి అవుతుందని భావిస్తున్నారు. గత కొన్నేళ్ల కాలంలో జైన్, అతని సహచరులు కలిసి దేశ విదేశాల్లో రూ.లక్ష కోట్ల మేర హవాలా/ అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారందరినీ విచారిస్తున్నారు.
ఎగుమతులు, దిగుమతులు జరిపినట్లుగా తప్పుడు ఇన్‌వాయిస్‌లను సృష్టించిన తీరుపైనా కొన్ని వివరాలు లభ్యమయ్యాయని, వీటన్నిటిలో దిల్లీకి చెందిన నరేశ్ జైన్ కీలక పాత్ర పోషించినట్లు కనిపిస్తోందని తెలిపారు.
సాంకేతికంగా, అక్రమంగా తరలింపు
దిల్లీలో జైన్ కార్యాలయాల్లో, అతని అనుచరుల ప్రాంగణాల్లో సోదాల తర్వాత విదేశీ బ్యాంకు ఖాతాల నిర్వహణకు సంబంధించిన 14 డిజిటల్ తాళాలను ఇదివరకే ఈడీ జప్తు చేసింది. డొల్ల కంపెనీలను నడిపించడంలో ఉపయోగిస్తున్న పత్రాలను, పెన్‌డ్రైవ్‌లను, హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకుంది. దుబాయ్, హాంకాంగ్, సింగపూర్ తదితర దేశాల్లో తెరిచిన 337 బ్యాంకు ఖాతాలను ఈడీ నిశితంగా పరిశీలిస్తోంది.
దేశంలో సంపాదించిన డబ్బును ఉత్తుత్తి సంస్థల ద్వారా విదేశాల్లోని ఖాతాలకు తరలించేవారని, సాంకేతికత ద్వారా మరికొంత మళ్లించేవారని ఈడీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 970 మందికి రూ.18,000 కోట్లను బదిలీ చేసినట్లు గుర్తించారు. ఖాతాలు తెరవడానికి ఉపయోగించిన అనేక తప్పుడు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్