ఇటీవలే షాహీన్‌బాగ్, జామియా నగర్లలో జరిగిన కాల్పుల ఘటనల నేపథ్యంలో.. దిల్లీ ఆగ్నేయ డీసీపీ చిన్మోయ్ బిస్వాల్పై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఆ ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల బిస్వాల్‌ను బదిలీ చేస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. బిస్వాల్ స్థానంలో సీనియర్ అడిషనల్ డీసీపీ కుమార్ జ్ఞానేష్‌ను బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఈసీ ఆదేశించింది.
ఏం జరిగింది?
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఎదుట సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతన్న విద్యార్థులపై జనవరి 30న ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. అనంతరం దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.
ఈ ఘటన జరిగిన రెండు రోజుల అనంతరం.. సీఏఏ నిరసనలకు కేంద్రంగా మారిన షాహీన్‌బాగ్‌లో మరో వ్యక్తి కాల్పులతో కలకలం రేపాడు. ఈ నేపథ్యంలోనే బిస్వాల్‌ను ఈసీ బదిలీ చేసింది.