యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది. యోగి 72 గంటలపాటు, మాయావతి 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. మంగళవారం ఉదయం 6గంటల నుంచి ఈ నిషేధం అమలు కానుంది. ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంది ఈసీ.
యోగి, మాయావతి మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. ఇరువురినీ తీవ్రంగా మందలించింది.
పోటాపోటీగా...
దేవ్బంద్లో ఓ పార్టీకి ఓటు వేయొద్దంటూ ఓ సామాజిక వర్గాన్ని అభ్యర్థించారు మాయావతి. ఇలా చేయడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనేనని ఎన్నికల సంఘం ప్రాథమిక నిర్ధరణకు వచ్చింది.
యోగి ఆదిత్యనాథ్ రెండు మతాల మధ్య ఘర్షణలకు దారితీసే విధంగా మతపరమైన వ్యాఖ్యలు చేశారని ఈసీ తాఖీదులిచ్చింది.
ఉదయమే సుప్రీం అసహనం...
యోగి, మాయ వివాదాస్పద వ్యాఖ్యలపై ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘం ఇద్దరికీ నోటీసులు ఇచ్చి, సరిపెట్టడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. వారిద్దరిపై ఏం చర్యలు తీసుకున్నారో ఈసీ ప్రతినిధి ఒకరు మంగళవారం సుప్రీంకోర్టుకు వచ్చి నివేదించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన కాసేపటికే ఈసీ చర్యలు తీసుకోవటం గమనార్హం.