జంతు చర్మాలతో చేసిన చెప్పులు చూసి ఉంటారు.. రెక్సిన్, లెదర్, రబ్బరుతో తయారైన పాదరక్షలు ధరించి ఉంటారు.. మరి ఎప్పుడైనా.. 'ఆవు పేడ చెప్పులు' వేసుకున్నారా? అసలు పేడతో చెప్పులేంటి అనుకుంటున్నారా? నిజమే ఇప్పటి వరకు అలాంటి ఉత్పత్తి ఎవరూ చేసి ఉండరు. కానీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని 'వైదిక్ ప్లాస్టర్' సంస్థ ఆవు పేడతో చెప్పులు తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
పేడను జల్లెడ పట్టి, అందులో సహజ నూనెలు కలిపి తయారు చేశారు ఈ చెప్పులు. 'గోమాత చరణ పాదుకాలు'గా నామకరణం చేసిన ఈ పాదరక్షలను మండి జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ శివరాత్రి మహోత్సవంలో ప్రదర్శనకు పెట్టారు. వినూత్నంగా కనిపించే ఈ చెప్పులు పర్యావరణహితమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు పంపిణీదారులు.
"మా ప్రత్యేక ఉత్పత్తి వైదిక్ చెప్పులు. ఇవి ప్రపంచంలో తొలి పేడ పాదరక్షలు. ఇవి, దేశీయ ఆవుల పేడతో తయారయ్యాయి. వీటిని ధరించడం వల్ల అలసట, చిరాకు దూరమైపోతాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరిగి బీపీ వంటి రోగాలు దరిచేరవు. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు కూడా తోడ్పడుతాయి."- కరణ్ సింగ్, మండి జిల్లా డిస్ట్రిబ్యూటర్.
ఎలాంటి రసాయనాలు, కాలుష్య కారకాలు లేకుండా తయారు చేసిన ఈ పాదరక్షలను... ప్రస్తుతానికి ప్రజల్లో అవగాహన కల్పించటానికి మాత్రమే తయారు చేశారు. అయితే, ఈ వినూత్న ప్రయత్నానికి వినియోగదారులు ఫిదా అవుతున్నారు. పేడ చెప్పులు మాకు కావాలంటే మాకు కావలని ఆర్డర్లు పెట్టేస్తున్నారు.