రష్యా కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వి'పై భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్‌కు అనుమతులు ఇచ్చింది డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ). ఈ మేరకు సంస్థ శనివారం అధికారిక ప్రకటన చేసింది.
"భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అంగీకారం తెలపడం మంచి పరిణామం. కరోనా కాలంలో సురక్షితమైన, సమర్థవంతమైన టీకా తెచ్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం."
-జీవీ ప్రసాద్, డా.రెడ్డీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
'స్పుత్నిక్-వి' టీకాను మనదేశంలో పరీక్షించి, ఆ తర్వాత తయారు చేసి విక్రయించటానికి డాక్టర్ రెడ్డీస్.. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ (రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగస్వామ్యం పొందిన డాక్టర్ రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల 'స్పుత్నిక్-వి' టీకాను సరఫరా చేయటానికి ఆర్‌డీఐఎఫ్ అంగీకరించింది. ఈ టీకాపై ఇప్పటికే మూడో దశ క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తోంది రష్యా. ఒప్పందంలో భాగంగా రష్యాలోని మూడో ట్రయల్స్ డాటాను రెడ్డీస్‌తో పంచుకోనున్నారు.
ఆగస్టు 11న 'స్పుత్నిక్-వి' వ్యాక్సిన్‌ను గమలేయా ఇన్‌స్టిట్యూట్, రష్యా ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్తంగా విడుదల చేశాయి.