దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికే మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు అందుకు తోడ్పడతాయని చెప్పారు.
కర్ణాటకలోని బాగల్కోట్లో ఆ రాష్ట్ర మంత్రి మురుగేశ్ ఆర్ నిరానీకి చెందిన ఎంఆర్ఎన్ గ్రూప్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన అనంతరం.. రైతుల సంక్షేమం కోసం కేంద్రం అహర్నిశలు పనిచేస్తోందని కొనియాడారు షా. రాష్ట్రంలోనూ సీఎం యడియూరప్ప కూడా రైతుల మేలుచేసే ఏ ఒక్క అవకాశాన్నీ వదలేట్లదని చెప్పారు. అందులో భాగంగానే కొత్త వ్యవసాయ చట్టాలకు కర్ణాటక సర్కార్ మద్దతు పలికిందని స్పష్టం చేశారు. ఈ విషయంలో యడియూరప్పకు అభినందనలు తెలిపారు మంత్రి.
కాంగ్రెస్‌పై విమర్శలు..
కాంగ్రెస్ ఉద్దేశాలు సరిగ్గా లేవని ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు షా. కాంగ్రెస్ హయాంలో రైతులకు రూ.6,000 నగదు సహకారం అందించడం, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలను ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. గత 70ఏళ్లుగా పెండింగ్‌లో ఉండి, ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని కశ్మీర్ అంశాన్ని కూడా తమ ప్రభుత్వం శాంతియుతంగా పరిష్కరించగలిగిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: ఏకాంత చిత్రాలు.. వీడియోలతో భర్త వేధింపులు