పాఠశాలకు వెళ్లే పిల్లలు అనవసర బరువు మోస్తున్నారని అనుకోవట్లేదని పేర్కొంది బాంబే హైకోర్టు. కాలానుగుణంగా పుస్తకాలు సన్నగా మారుతున్నాయని తెలిపింది. పాఠశాల బ్యాగుల బరువును తగ్గించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. బ్యాగుల బరువు తగ్గింపుపై కొత్త ఆదేశాలు అవసరం లేదని స్పష్టం చేసింది.
పాఠశాల బ్యాగుల బరువుపై సామాజిక కార్యకర్త స్వాతి పాటిల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నండ్రగోజ్, జస్టిస్ ఎన్ఎమ్ జమ్‌దార్‌ల ధర్మాసనం పరిశీలించింది.
"మనం చదువుకునే రోజుల్లో పాఠ్యపుస్తకాలు మందంగా ఉండేవి. ప్రస్తుతం చాలా సన్నగా ఉంటున్నాయి. పుస్తకాల్లో చాలా మార్పులు వచ్చాయి. అన్ని అంశాలు అందులో ప్రచురితమవుతున్నాయి. మన పుస్తకాలు మహిళలు మాత్రమే ఇంటి పని చేస్తారని చెప్పేవి. కానీ ప్రస్తుతం పురుషులు కూడా చేస్తున్నారని చెబుతున్నాయి. మన పుస్తకాలు చాలా బరువుగా ఉండేవి. అయినప్పటికీ మనకు వెన్ను నొప్పి రాలేదు. పాఠశాలకు వెళ్లే పిల్లలు అనవసర బరువు మోస్తున్నారని అనుకోవట్లేదు. "
- బాంబే హైకోర్టు
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ, ఇతర సంస్థలు కాలానుగుణంగా మార్పులు చేస్తూ పుస్తకాలు సన్నగా ఉండేలా చూస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న అంశాలను క్షుణ్నంగా తెలుసుకునేందుకు పుస్తకాలను పాఠశాల నుంచి ఇంటికి, ఇంటి నుంచి పాఠశాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఎన్సీఆర్టీ వెబ్సైట్లో ఉన్న పాఠ్యాంశాలను పరిశీలించి ఏదైనా సమస్య ఉన్నట్లు అనిపిస్తే తిరిగి కోర్టును సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది ధర్మాసనం.
ఇదీ చూడండి: సుప్రీంకోర్టు రిజిస్ట్రీపై పోలీసుల పర్యవేక్షణ!