వారసత్వం, సానుభూతి...! దేశ రాజకీయాల్లో చాలా కాలంగా భాగమైపోయిన విషయాలు. అనేక ఎన్నికల్లో ఫలితాన్ని నిర్ణయించే కీలకాంశాలు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య పోటీ జరుగుతోంది. ఇందుకు కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గం వేదికైంది.
కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు. జేడీఎస్-కాంగ్రెస్ మిత్రపక్షాలు. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్నాయి రెండు పార్టీలు. కాంగ్రెస్ 20 స్థానాల్లో, జేడీఎస్ 8చోట్ల. మాండ్య స్థానం జేడీఎస్‌కు దక్కినా... 2 పార్టీలకు తలనొప్పిగా మారింది.
మాండ్యపై జేడీఎస్ గురి...
దేవెగౌడ కుటుంబంలో మూడో తరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడను రంగంలోకి దింపాలని నిర్ణయించింది జేడీఎస్. ఇందుకు లోక్‌సభ ఎన్నికల్నే ముహూర్తంగా ఎంచుకుంది.
నిఖిల్ రాజకీయ ప్రస్థానం ఆరంభంలోనే అదరగొట్టాలన్న ఉద్దేశంతో ఉంది జేడీఎస్. అది సాధ్యపడాలంటే... పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం కావాలి. అలాంటివాటి జాబితాలో ముందు వరుసలో ఉంది మాండ్య. అక్కడ వొక్కలిగ సామాజికవర్గానిదే మెజారిటీ. నిఖిల్ విజయానికి తిరుగులేని చోటు అదేనన్నది జేడీఎస్ ఆలోచన. అందుకే మాండ్యను నిఖిల్‌కు వదిలిపెట్టేలా మిత్రపక్షం కాంగ్రెస్‌ను ఒప్పించింది.
ఇదీ చూడండి :మిత్రులే ప్రత్యర్థులైతే...!
సుమలత రాకతో...
మాండ్య నుంచి గతంలో 3 సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు అంబరీశ్. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. గతేడాది చివర్లో అనారోగ్యంతో కన్నుమూశారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు అంబరీశ్ భార్య సుమలత... కన్నడ రాజకీయాల్లో సునామీ సృష్టించారు. మాండ్య నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ మాత్రం టికెట్ నిరాకరించింది. పొత్తు ధర్మంలో భాగంగా ఆ స్థానం జేడీఎస్దేనని తేల్చిచెప్పింది. సుమలత మాత్రం వెనక్కి తగ్గలేదు.
స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీచేస్తానని ప్రకటించారు సుమలత. నియోజకవర్గంలోని మాలవల్లీ ప్రాంతంలో ఇటీవల ప్రచారం నిర్వహించారు. అంబరీశ్ అభిమానులు 4వేల మంది భారీ బైక్ ర్యాలీ తీశారు. పోటీగా... మరుసటి రోజు ఇదే ప్రాంతంలో నిఖిల్ గౌడ ప్రచారం చేశారు.
ఇదీ చూడండి :దంగల్ 2019: పవార్ 'పవర్' ప్లే
వారసులా... స్థానికులా...?
నిఖిల్, సుమలత వర్గాల మధ్య మాటలయుద్ధం మొదలైంది. అది సామాజిక మాధ్యమాలకు విస్తరించింది. పరస్పర వ్యతిరేక ప్రచారాలతో ఇరు వర్గాలు నెట్టిల్లును హోరెత్తిస్తున్నాయి.
అంబరీశ్ వర్గీయులు.... కుమారస్వామి వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. నిఖిల్ గ్యోబ్యాక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. నిఖిల్ వర్గీయులు... "మన జిల్లా-మన మాండ్య" అంటూ స్థానికత సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారు.
అంబరీశ్ అభిమానులతోపాటు కర్ణాటక సినీ పరిశ్రమ 'శాండల్‌వుడ్' ప్రముఖులు దర్శన్, సుదీప్, చరణ్‌రాజ్ సుమలతకు మద్దతు ప్రకటించారు. సుమ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు చరణ్‌రాజ్.
ఇదీ చూడండి :102 ఏళ్ల వయసులో మళ్లీ సిద్ధం
రేవన్న వ్యాఖ్యలతో చిక్కులు...
కుమార్ స్వామి సోదరుడు, కర్ణాటక మంత్రి హెచ్డీ రేవన్న గౌడ... సుమలతపై విమర్శలు చేసి చిక్కుల్లో పడ్డారు. అంబరీశ్ మరణించి నెల రోజులైనా కాకముందే రాజకీయాల్లోకి రావాలని ఆమె నిర్ణయించుకున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యల్ని ప్రత్యర్థులతోపాటు కొందరు సొంత పార్టీ నేతలూ తప్పుబట్టారు.
ఇదీ చూడండి :దంగల్ 2019: అంకెల్లో ఎన్నికలు
రాజీ యత్నాలు...
పోటీ నుంచి తప్పుకునేలా సుమలతను ఒప్పించేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అవసరమైతే మరో నియోజకవర్గం ఇచ్చేందుకు సిద్ధమని సంకేతాలిచ్చింది. సుమ మాత్రం... ఈనెల 18న తుది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పి... ఉత్కంఠ కొనసాగిస్తున్నారు.