‘మనం బాగుండాలి, మన పక్కవాడూ బాగుండాలి’. ఇదే ఇప్పటి నినాదం కావాలి. ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో చూసి తెలుసుకోవటం కష్టం. అందరిలోనూ దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు స్పష్టంగా కనిపించాలని లేదు. కరోనా ఇన్‌ఫెక్షన్ బారినపడ్డవారిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా వారి నుంచి ఇతరులకు వ్యాపించొచ్ఛు అందువల్ల ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది. ఇందుకోసం ఇటీవలి కాలంలో విధిగా మాస్కులు ధరించటం చూస్తూనే ఉన్నాం. ఇది వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటు తరచూ చేతులు కడుక్కోవటం, బయటకు వెళ్లినప్పుడు ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటిస్తేనే అనుకున్నది సాధించగలం.
సర్జికల్ మాస్కులు
మూడు పొరలతో కూడిన వీటిని శస్త్రచికిత్సలు, రోగులకు సేవలు చేసేటప్పుడు ధరిస్తారు. బ్యాక్టీరియాను అడ్డుకోవటానికి.. ముక్కు నోరు నుంచి తుంపర్లు, గాలి బయటకు రాకుండా ఉండటానికివి తోడ్పడతాయి. కాగితం లేదా కృత్రిమ వస్త్రం పొరల మధ్య కరిగించిన పాలిమర్ పదార్థంలోకి గాలిని పంపించి వీటిని తయారుచేస్తారు. సూక్ష్మక్రిములు మన లోపల్నుంచి బయటకు, బయటి నుంచి లోపలికి వెళ్లకుండా అడ్డుకునేది పాలిమరే. ఈ మాస్కులు మరీ బిగుతుగా ఉండవు. శ్వాస తీసుకుంటున్నప్పుడు అంచుల నుంచి గాలి లోపలికి వస్తుంది. అందువల్ల సూక్ష్మక్రిములను పూర్తిగా అడ్డుకోలేవు. అయినా జబ్బు లక్షణాలు లేనివారి నుంచి పెద్దఎత్తున వైరస్ వ్యాపించకుండా చూడటానికి తోడ్పడతాయి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పెద్ద తుంపర్లు (0.3 మైక్రాన్ల కన్నా ఎక్కువుండేవి) గాలిలో కలవకుండా చూస్తాయి. ముఖాన్ని పదే పదే చేతులతో తాకకుండా ఉండటానికీ ఉపయోగపడతాయి. వీటిని ఒకసారి వాడిన తర్వాత పారెయ్యాలి. మళ్లీ మళ్లీ వాడకూడదు.
ఎన్-15 మాస్కులు
వీటినే రెస్పిరేటర్లు అంటారు. ఇవి చాలా బిగుతుగా ఉంటాయి. దీని గుండా గాలి మాత్రమే వెళ్తుంది. అదీ వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములను వడగట్టిన తర్వాతే. ఈ మాస్కులు అతి సూక్ష్మమైన రేణువులనూ 95% వరకూ అడ్డుకుంటాయి.
అడ్డుకుంటాయి. వీటిల్లోని కవాటాల వంటి భాగాలు లోపలి వైపున వేడిని, కార్బన్ డయాక్సైడ్ మోతాదులను, తేమను తగ్గిస్తాయి. వడపోత సామర్థ్యాన్ని బట్టి వీటిల్లో ఎన్-99, ఎన్-100 రకం మాస్కులూ ఉన్నాయి. చైనా ప్రమాణాలకు అనుగుణంగా తయారైనవాటిని కెఎన్95, ఐరోపా ప్రమాణాలకు అనుగుణమైనవాటిని ఎఫ్‌ఎఫ్‌పి రకం మాస్కులుగా పేర్కొంటారు. దీర్ఘకాల శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బుల వంటి ఇతరత్రా సమస్యలు గలవారు డాక్టర్ సలహా తీసుకున్నాకే వీటిని వాడుకోవాలి. వీటిని ఒకసారికి మాత్రమే వాడుకోవాలి. చిరిగినా, దెబ్బతిన్నా, శ్వాస తీసుకోవటం కష్టమవుతున్నా మాస్కును తీసేసి కొత్తది ధరించాలి. పిల్లలకు, గడ్డాలు, మీసాలు గలవారికివి పెద్దగా పనికిరావనే చెప్పుకోవచ్ఛు ఎందుకంటే వీరి ముఖానికివి బిగుతుగా పట్టుకోవు.
గుడ్డ మాస్కులు...
నేసిన వస్త్రంతో తయారుచేయటం వల్ల వీటి రంధ్రాలు సర్జికల్ మాస్కుల కన్నా పెద్దగా ఉంటాయి. అందువల్ల వడపోత సామర్థ్యమూ తక్కువే. ముఖానికి అంత గట్టిగా పట్టుకొని కూడా ఉండవు. మహమ్మారులు ప్రబలినప్పుడు ఇతరత్రా మాస్కులేవీ అందుబాటులో లేని సందర్భాల్లో వీటిని వాడుకుంటుంటారు. ఇవి ఫ్లూ వ్యాప్తిని 75% వరకూ అడ్డుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కనీస దూరం పాటించటానికి వీల్లేని చోట్ల (దుకాణాల వంటివి).. ముఖ్యంగా మహమ్మారులు బాగా ప్రబలిన ప్రాంతాల్లో వీటిని వాడుకోవచ్ఛు చేతి రుమాళ్లు, టీ షర్టులు, తువ్వాళ్ల వంటి వాటితో ఎవరికి వారు వీటిని తయారుచేసుకోవచ్ఛు గుడ్డ మాస్కులను రెండేళ్ల లోపు పిల్లలు, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా గలవారు, తమకు తాముగా మాస్కులు తీయలేనివారు ధరించరాదు.
ఆరోగ్యంగా ఉన్నవారికి మాస్కులు అవసరం లేదన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు. మనుషుల మధ్య దూరం పాటించటం, తరచూ చేతులు కడుక్కోవటం, దగ్గినా తుమ్మినా ముక్కుకు నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవటం.. రుమాలు లేకపోతే మోచేతి మధ్య భాగాన్నయినా అడ్డుపెట్టుకోవటం వంటి జ్రాగత్తలు తీసుకోవాలి. కొందరికి మాత్రం మాస్కులు అవసరం. ఎవరికి ఏది కావాలనేది తెలుసుకొని ఉండాలి.
ఎవరికి ఏ మాస్కులు?
- జబ్బు బారినపడ్డవారికి: జలుబు, దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు గలవారికి.. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు గలవారికి సర్జికల్ మాస్కులు అవసరం.
- రోగులకు సేవలు చేసేవారికి: జలుబు, దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు గలవారికి.. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు గలవారికి సర్జికల్ మాస్కులు అవసరం.
- వైద్య సిబ్బందికి: కొవిడ్-19 బాధితులకు మినహా ఇతరత్రా జబ్బులకు చికిత్స, సేవ చేసేవారంతా సర్జికల్ మాస్కులు ధరించాలి. అందుబాటులో ఉంటే ఎన్-95 మాస్కులు ధరిస్తే ఇంకా మంచిది.
- కొవిడ్-19కు చికిత్స చేసేవారికి: కరోనా ఇన్‌ఫెక్షన్ బాధితులకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు, అనుబంధ వైద్య సిబ్బంది విధిగా ఎన్-95 మాస్కులు ధరించాలి. సీపీఆర్, వెంటిలేషన్, బ్రాంకోస్కోపీ, శ్వాసనాళంలోకి గొట్టాన్ని పంపించే చికిత్సల వంటివి చేసే గదుల్లో ఉండేవారికీ ఇవి అవసరమే. మరణించినవారిని తరలించేవారు ఎన్-95 మాస్కులతో పాటు శరీరాన్ని కప్పి ఉంచే రక్షణ పరికరాలు కూడా ధరించాలి.
ధరించటానికి ముందూ తర్వాతా..
- మాస్కు ధరించటానికి ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌ను చేతులకు రాసుకోవాలి.
- నోరు, ముక్కు ఏమాత్రం కనిపించకుండా మాస్కు ధరించాలి. ముఖానికి, మాస్కుకు మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా చూసుకోవాలి.
- మాస్కు తడిగా అయితే వెంటనే తీసేసి కొత్తది పెట్టుకోవాలి. ఒక మాస్కును ఒకసారే వాడాలి.
- మాస్కు పెట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు భాగాన్ని చేతులతో తాకరాదు. ఒకవేళ తాకితే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
- మాస్కును తీసేటప్పుడు చెవుల చుట్టూ ఉండే పట్టీలను పట్టుకునే తీయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు భాగాన్ని తాకరాదు. తీసిన మాస్కును సంచీలో పెట్టి బిగించి చెత్త బుట్టలో వేయాలి. లేదంటే మూత ఉన్న చెత్తబుట్టలో వేయాలి.
- మాస్కును తీసిన తర్వాత చేతులను సబ్బుతో రుద్దుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వీలుంటే శానిటైజర్ రాసుకోవచ్ఛు
- ఎత్తయిన భవనాల్లో లిఫ్ట్‌లు, మెట్ల వంటి చోట్ల వైరస్ అంటుకొని ఉండొచ్ఛు కాబట్టి అపార్ట్‌మెంట్లలో నివసించేవారు ఇంట్లోనే మాస్కును పెట్టుకొని బయటకు రావాలి. ఇంట్లోకి వచ్చాకే తీసెయ్యాలి.
- గుడ్డ మాస్కులను రోజూ శుభ్రంగా ఉతికి, ఆరెయ్యాలి.