కర్ణాటకలో ముడుపుల బాగోతం దుమారం రేపుతోంది. రెండు జాతీయ పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప రూ.1800 కోట్ల ముడుపులు భాజపా అగ్రనేతలకు ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు అమిత్ షా. ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే నిరాశతోనే ఫోర్జరీపై ఆధారపడి ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధీపై విమర్శలు గుప్పించారు అమిత్ షా.
" అన్ని రకాల తప్పుడు ఆరోపణలు సమసిపోయిన తరువాత కాంగ్రెస్ నిరాశతో ఫోర్జరీపై ఆధారపడుతోంది. ఇప్పుడు వారిని ఫోర్జరీ సైతం కాపాడలేదు. కాంగ్రెస్కు సంబంధించిన ఓ మంత్రి ఇచ్చిన కొన్ని విడి పత్రాలను నమ్మడం..రాహుల్ గాంధీ నాయకత్వ నైపుణ్యాలపై విశ్వసనీయత పెట్టుకోవడం లాంటిదే." - అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు.
పత్రాలపై ఆదాయపన్ను శాఖ వివరణ
ముడుపుల పత్రాలపై రాజకీయ దుమారం చెలరేగిన తరుణంలో కేంద్ర ఆదాయపన్నుల శాఖ (సీబీడీటీ) వివరణ ఇచ్చింది. ఏడాదిన్నర క్రితం స్వాధీనం చేసుకున్న పత్రాల్లోని సమాచారం, వ్యక్తిగత పేర్లపై సందేహం వ్యక్తం చేసింది. వాటి అసలైన పత్రాలు తమవద్ద లేవని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ వద్ద సోదాల్లో భాగంగా ఆగస్టు 2017లో డైరీ పేజీల జెరాక్స్ కాపీలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అవి 2009 కర్ణాటక అసెంబ్లీకి చెందినవిగా పేర్కొన్నారు.
పత్రాలు బీఎస్ యడ్యూరప్ప రాసిన డైరీలోనివని వాంగ్మూలంలో శివకుమార్ పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. యడ్యూరప్ప అధికారంలో ఉన్న సమయంలో భాజపా నేతలకు చెల్లింపులు చేసినట్లు శివకూమార్ చెప్పినట్లు అధికారులు వివరించారు. పత్రాలను ఫోరెనిక్స్ పరీక్షలకు పంపగా వాటి ఒరిజినల్ పత్రాలు ఉంటేనే చెప్పగలమని తేల్చినట్లు చెప్పారు. వాటి ఒరిజినల్స్ ఎక్కడున్నాయో తెలియదన్నారు. ఆ పత్రాల్లోని సమాచారంపై సందేహం వ్యక్తం చేశారు.