అయోధ్యలో నిర్మించనున్న మసీదు ఆకృతిని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(ఐఐసీఎఫ్) శనివారం.. విడుదల చేసింది. మసీదుతో పాటు 200 పడకల ఆస్పత్రి, సామూహిక భోజనశాల, అధునాతన గ్రంథాలయ కాంప్లెక్స్ డిజైన్‌ను సైతం విడుదల చేసింది.
నూతన సాంకేతికత ఉపయోగించి మసీదు డిజైన్ రూపొందించినట్లు జామియా మిలియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్ తెలిపారు. విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన.. మసీదు విద్యుత్ అవసరాల కోసం సౌరశక్తిని వినియోగించనున్నట్లు వెల్లడించారు.
"మసీదు డిజైన్ అధునాతన సాంకేతికత ఆధారంగా రూపొందించాం. దీర్ఘ వృత్తాకార ఆకారంలో గుమ్మటం లేకుండా మసీదు ఉంటుంది. రెండంతస్తుల మసీదులో ఎలాంటి మినార్లు(పొడవైన స్తంభంలాంటి నిర్మాణాలు) ఉండవు. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేసుకోవచ్చు."
-ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్, జామియా మిలియా యూనివర్సిటీ
అన్ని రకాల సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మించనున్నట్లు ఐఐసీఎఫ్ తెలిపింది. పోషకాహార లోపం ఉన్న పిల్లలు, గర్భిణులపై ప్రత్యేకంగా దృష్టిసారించేలా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించింది.
నిర్మాణం ఆలస్యం!
అయితే, నూతన నమూనాలను ఆమోదించడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగా అనుకున్న జనవరి 26 నాటికి పనులు ప్రారంభం కాకపోవచ్చని ఐఐసీఎఫ్ కార్యదర్శి అతర్ హుస్సేన్ తెలిపారు. ఆగస్టు 15న పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
సీఎం యోగికి ఆహ్వానంపై..
ఇస్లాం సంప్రదాయంలో శంకుస్థాపన కార్యక్రమం భారీ స్థాయిలో ఉండదని, అందువల్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఆహ్వానం పంపించలేదని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు అతర్ హుస్సేన్. మసీదు, ఆస్పత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత దేశంలోని ప్రముఖ వ్యక్తులను పిలుస్తామని తెలిపారు.
మసీదు పర్యావరణ హితంగా ఉంటుందని చెప్పారు హుస్సేన్. దీనికి రాజులు, నవాబుల పేర్లు పెట్టేది లేదని స్పష్టం చేశారు. 'ధన్నీపుర్ మసీదు' అని పెట్టాలని వ్యక్తిగతంగా సూచించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కాబా స్తూపం ఆకృతిలో అయోధ్య మసీదు