దేశ రాజధాని దిల్లీ చలికి వణికిపోతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతూ చలితీవ్రత పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు సఫ్దర్గంజ్లో 2.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ సీజన్లో ఇదే కనిష్ఠ ఉష్ణోగ్రతగా అధికారులు చెబుతున్నారు.
మిగిలిన ప్రాంతాల్లో ఆయా నగర్లో 1.9, లోధిరోడ్డులో 1.7, పాలం 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దిల్లీ వాసుల ఇబ్బందులు..
చలితీవ్రత, పొగమంచు కారణంగా దిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వెలుతురు లేమి కారణంగా 4 విమానాలను ఇతర మార్గాలకు మళ్లించారు. 24 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
డిసెంబర్ 14వ తేదీ నుంచి దిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోతూ వస్తున్నాయి. 1901 తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన రెండో డిసెంబర్గా ఈ నెల నిలిచే అవకాశముందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.