దిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీపావళి వేడుకల అనంతరం రాజధానిని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పక్కనే ఉన్న నోయిడాలోనూ ఇదే పరిస్థితి.
హపుర్లో వాయు నాణ్యతా సూచీ 657 గా నమోదైంది. లోధీ రోడ్డులో 500కు చేరుకుంది. అయితే... గత మూడేళ్లతో పోలిస్తే తీవ్రత తక్కువగానే ఉందని అధికారులు తెలిపారు.
ఐదేళ్లలో తొలిసారి..
ఆర్థిక రాజధాని ముంబయిలో ఈసారి ఎక్కువమంది కాలుష్య రహిత దీపావళిని చేసుకున్నారు. వేడుకల అనంతరం అక్కడ వాతావరణం కూడా పరిశుభ్రంగా కనిపించింది. గత ఐదేళ్లలో ఇంత పరిశుభ్ర వాతావరణం ఉండటం ఇదే తొలిసారి.
పశ్చిమ తీర ప్రాంతాలను 'క్యార్' తుపాను ఠారెత్తిస్తున్న నేపథ్యంలో ముంబయిలో కాలుష్యం తగ్గి ఉండవచ్చని గుఫ్రాన్ బేగ్ అనే అధికారి తెలిపారు. గాలిలో ఉండే హానికర ధూళి, రసాయన కణాలు వర్షం, తీవ్ర గాలుల ధాటికి తుడిచిపెట్టుకుపోయాయని ఆయన అన్నారు.