దిల్లీలో గాలి నాణ్యత శనివారం నాటికి పేలవస్థాయిని అందుకుంది. కాలుష్య స్థాయిలు ఏకంగా ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వాయు నాణ్యత సూచీ అత్యధికంగా 320 పాయింట్లు ఉండగా.. శుక్రవారం 315గా నమోదు అయింది. ఇప్పటికే తక్కువగా నమోదవుతోన్న ఉష్ణోగ్రతలతో పాటు పవన వేగం కూడా తక్కువైతే వాయు నాణ్యతా సూచీ మరింత క్షీణించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే గాలి వేగం పెరిగితే.. పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని వెల్లడించారు.
మరోవైపు దిల్లీలో కాలుష్య స్థాయి పెరగడానికి.. పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం ప్రధాన కారణంగా తెలుస్తోంది.
వెంటిలేషన్ ఇండెక్స్ పెరిగితే..
ఇప్పటికే వాయు నాణ్యత తక్కువగా నమోదైన నేపథ్యంలో.. వెంటిలేషన్ ఇండెక్స్ పెరిగితే మంచిదని అంటున్నారు వాతావరణశాఖ నిపుణులు. ఇది గాలిలో కాలుష్య కారకాల శాతాన్ని లెక్కిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లలో సగటు వెంటిలేషన్ ఇండెక్స్ సెకనుకు 1,334 చదరపు మీటర్లు ఉండగా.. గతేడాది ఇదే కాలంలో సెకనుకు 1,850 చ.మీగా ఉందని అధికారులు తెలిపారు.
కాలుష్యం పెరిగితే కరోనా కూడా...
దిల్లీలో కాలుష్యం పెరిగితే కరోనా కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. వైరస్ అనుకూల వాతావరణ పరిస్థితులు, పొరుగు ప్రాంతాలలో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, స్థానిక కాలుష్య కారకాల వల్ల ప్రజలు ఇబ్బందులు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు విపరీతంగా పెరిగిన వాహనాల వినియోగం వాయు కాలుష్యాన్ని ప్రభావితం చేసున్నాయి.