సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనుంది. ఈశాన్య దిల్లీ అల్లర్ల నేపథ్యంలో కోవింద్‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్, ఇతర కాంగ్రెస్ సీనియర్లు పి.చిదంబరం, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, ఆనంద్ శర్మ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
ఈ సందర్భంగా విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు మార్చ్‌గా వెళ్లి.. వినతి పత్రం అందచేయనున్నట్లు సమాచారం.
అంతకుముందు దిల్లీ హింసాత్మక ఘటనలను ఖండించారు సోనియా గాంధీ. అల్లర్లకు భాజపానే కారణమని.. బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇతర పార్టీలు కూడా...
దిల్లీ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఇతర విపక్ష పార్టీలు కూడా రాష్ట్రపతిని కలిసేందుకు సమయం కోరాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డీఎంకే, ఎన్సీపీ, లోక్‌తంత్రిక్ జనతా దళ్ తదితర పార్టీలతో కూడిన ఈ బృందం ఫిబ్రవరి 28లోగా అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరింది.
సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాలు ఈ నెల 23న చేపట్టిన ఆందోళనలతో ఈశాన్య దిల్లీలో ఘర్షణలు చెలరేగాయి. 3 రోజుల వ్యవధిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. క్రమక్రమంగా శాంతియుత వాతావరణం నెలకొంటోంది.