సలహాలు కోరిన అమిత్ షా
దిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయికి చేరుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. దిల్లీలో కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన నిర్ణయాలపై సూచనలను కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
దిల్లీలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కలవరపెడుతోంది. సోమవారం నాటికి దిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 41,182కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1327మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా మరణాలు అధికంగా సంభవిస్తున్న రాష్ట్రాల్లో దిల్లీ మూడో స్థానంలో ఉంది. భవిష్యత్తులో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు.
రెండు దఫాలుగా బేటీ..
ఈ నేపథ్యంలోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఉన్నతాధికారులతో రెండు ధఫాలుగా ఆదివారం సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అమిత్ షా. వారం రోజుల్లో దిల్లీలో భారీగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
ముందుజాగ్రత్త చర్యగా 500 రైలు బోగీల్లో 8 వేల పడకలను సిద్ధం చేసి దిల్లీకి అందుబాటులో ఉంచుతున్నట్లు అమిత్‌షా ప్రకటించారు. దిల్లీ ప్రభుత్వానికి సహకరించేందుకు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా దిల్లీకి బదిలీ చేశారు.