గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ప్రాంతాన్ని దిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. నిరంతర నిఘాతో పహారా కాస్తున్నాయి. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీతో దిల్లీ సరిహద్దుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశమున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో..
ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా.. సరిహద్దు తనిఖీలతో పాటు.. అద్దెదారుల వివరాలు సేకరిస్తున్నారు. సిమ్ కార్డు విక్రయదారులు, సెకండ్ హ్యాండ్ కార్ డీలర్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. బస్టాండులు, మెట్రో, రైల్వే స్టేషన్లు సహా.. విమానాశ్రాయం వద్ద భద్రతను మరింత పెంచారు. రద్దీ మార్కెట్లలో గస్తీని పెంచిన పోలీసులు.. వాహన తనీఖీలు ముమ్మరం చేశారు. పెద్ద హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటి సున్నిత ప్రాంతాల్లో వ్యవహరించాల్సిన తీరుపై స్థానిక పోలీసులు సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇస్తున్నారు
ప్రజా భాగస్వామ్యంతో..
ముందస్తు తనిఖీల్లో భాగంగా.. సున్నిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న పోలీసులు.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇళ్లల్లోని ప్రజలకు సాధారణ భద్రతా సూచనలు చేస్తూ.. అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రధాన పాయింట్లలో..
నగరంలోకి వచ్చే ప్రధాన పాయింట్లలో 20మందికి పైగా కమాండోలను మోహరించినట్టు లజ్పత్ నగర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. వీర్ సావర్కర్ మార్గ్, సెంట్రల్ మార్కెట్ ప్రాంతాల భద్రతను కనీసం 150సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
అప్రమత్తం చేస్తూ..
సరోజిని నగర్ మార్కెట్లో అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు రోజువారీ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. దుకాణదారులతో కూడిన పోలీసు సేవా వలంటీర్ల సేవలు వినియోగించుకుంటామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నైరుతి) ఇంగిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఉగ్రవాద దాడి జరిగినప్పుడు మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేయించేందుకు ఈ బృందం సహాయపడుతుందని వివరించారు.
ఇదీ చదవండి: 'ట్రాక్టర్ ర్యాలీ'పై వీడని సందిగ్ధత- శుక్రవారం మళ్లీ భేటీ