దిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. 54 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. పటేల్ నగర్ నుంచి కేంద్ర మాజీ మంత్రి క్రిష్ణ తిరాత్ పోటీ చేయనుండగా... దిల్లీ మాజీ మంత్రి అర్విందర్ లవ్లీ.. గాంధీ నగర్ స్థానంలో నుంచి బరిలో ఉన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఆల్కా లాంబ.. చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ కీర్తీ ఆజాద్ భార్య పూనమ్ ఆజాద్... సంగం విహార్ నుంచి పోటీలో ఉండనున్నారు. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నియోజకవర్గమైన పాట్పర్గంజ్ స్థానంలో లక్ష్మణ్ రావత్‌ను బరిలో నిలిపింది కాంగ్రెస్.
ఈరోజే ఆప్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన లాల్ బహదూర్ శాస్త్రీ మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రీ సొంత నియోజకవర్గమైన ద్వారకా నుంచే బరిలోకి దించింది కాంగ్రెస్. శాస్త్రీ ఇది వరకే.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య విలువలను త్యజించి పార్టీ టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు.
అయితే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నియోజకవర్గమైన న్యూదిల్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేయలేదు.
మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) సైతం తమ అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 42 మంది పేర్లను ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి టికెట్లు రాని నేతలకు బీఎస్పీ టికెట్లు ఇచ్చింది.
ఇదీ చదవండి: బోయింగ్ 737 మ్యాక్స్‌లో మరో కొత్త సమస్య!