దిల్లీ అల్లర్లకు ఆజ్యం పోస్తూ రాజకీయ నాయకులు చేసిన ద్వేషపూరిత ప్రసంగాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై మార్చి 12న విచారణ చేపడతామని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
పౌర చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య దిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఇదే సమయంలో హింసాత్మక చర్యలకు ఆజ్యంపోస్తూ కొందరు రాజకీయనేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ఫలితంగా ఘర్షణలు మరింత ఉద్రిక్తమై 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో బాధ్యులైన రాజకీయ నేతలను అరెస్టు చేయాలంటూ దిల్లీ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మార్చి 12న వీటిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం.
పోస్టుమార్టం వీడియోలు తీయండి
ఈశాన్య దిల్లీ అల్లర్లలో మరణించినవారి పోస్టుమార్టం వీడియోలు కచ్చితంగా చిత్రీకరించాలని దిల్లీ హైకోర్టు అన్ని ఆసుపత్రులను ఆదేశించింది. జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, జస్టిస్ ఐఎస్ మెహతాల ధర్మాసనం... అల్లర్లలో మరణించిన వారి డీఎన్ఏ నమూనాలను భద్రపరచాలని, బుధవారం జరిగే తదుపరి విచారణ వరకు గుర్తు తెలియని మృతదేహాలను పారవేయవద్దని ఆసుపత్రులను ఆదేశించింది.
దిల్లీ అల్లర్లలో తప్పిపోయిన తన బావ కోసం ఓ వ్యక్తి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... తాజా ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: దిల్లీ అల్లర్లపై దద్దరిల్లిన ఉభయసభలు .. ఈనెల 11కు వాయిదా