రాజధాని దిల్లీలో అల్లర్లను నియంత్రించేందుకు ఆప్ సర్కారు చర్యలు చేపట్టింది. దిల్లీ అసెంబ్లీ 'శాంతి, సామరస్య కమిటీ' నేడు ఓ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని ప్రారంభించనుంది. ఎవరైనా నకిలీ వార్తలు, విద్వేషపూరిత సందేశాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ నంబర్‌కు చేయవచ్చని కమిటీ తెలిపింది..
ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత వాటిని పోలీసులకు పంపుతామని కమిటీ ఛైర్మన్ ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు.
" మీరు ఏదైనా ఛాట్ గ్రూప్‌లో ఉన్నప్పుడు... ఎవరైనా రెచ్చగొట్టే సందేశాలను పంపితే, వెంటనే మీరు మాకు ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదుపై ఎఫ్ఐర్ నమోదైతే చేసినవారికి రూ.10,000 బహుమతి ఇస్తాం." - భరద్వాజ్, కమిటీ ఛైర్మన్
ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఎందరో ప్రాణాలను కాపాడిన వారికీ బహుమానం ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించినట్లు తెలిపారు.
వాట్సాప్ లేదా సామాజిక మాధ్యమాల్లో విద్వేష సందేశాలు పెట్టేవారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కమిటీ పేర్కొంది.
- ఇదీ చూడండి: మోదీ జీ అలా చేయొద్దు- ట్రెండింగ్‌లో '#నో సర్'