ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు.. దిల్లీ అసెంబ్లీ శాంతి భద్రతల కమిటీ తాజాగా మరోసారి నోటీసులు పంపింది. ఫేస్‌బుక్‌లో విద్వేష పూరిత ప్రసంగాల విషయమై సెప్టెంబర్ 23లోగా విచారణకు హాజరు కావాలని.. భారత్‌లోని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్ మోహన్‌కు సూచించింది. ఈ మేరకు దిల్లీ శాంతి భద్రత కమిటీ ఆదివారం ఓ ప్రకటన చేసింది.
"దిల్లీ అల్లర్ల సమయంలో విద్వేష ప్రసంగాల విషయంలో ఫేస్‌బుక్ వ్యవహరించిన తీరుపై విచారణ జరుగుతుంది. ఎండీ అజిత్ మోహన్‌కు చివరి సారిగా నోటీసులు జారీ చేశాం. సెప్టెంబర్ 23లోగా ఆయన కమిటీ ముందు హాజరు కావాలి" అని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ శాంతి భద్రతల కమిటీకి ఎమ్మెల్యే రాఘవ్ చద్దా నేతృత్వం వహిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఫేస్‌బుక్ నిష్పాక్షికంగా, తటస్థంగానే పనిచేస్తోంది
గతంలో ఫేస్‌బుక్‌కు సమన్లు..
దేశ రాజధానిలో అల్లర్ల సమయంలో ఫేస్‌బుక్ చూసీ చూడనట్లు వ్యవహరించిందని ఆరోపిస్తూ దిల్లీ అసెంబ్లీ కమిటీ ఇటీవల ఫేస్‌బుక్‌కు సమన్లు పంపింది. తొలిసారి నోటీసులపై ఫేస్‌బుక్ స్పందిస్తూ.. "ఈ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే మేము పార్లమెంటు కమిటీ ముందు హాజరయ్యాం. మీరు పంపిన నోటీసులను వ్యతిరేకిస్తున్నాం. వాటిని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాం" అని పేర్కొంది.
అయితే.. ఫేస్‌బుక్ స్పందనపై శాంతి భద్రతల కమిటీ తీవ్రంగా స్పందించింది. సంస్థ ప్రకటన ఆమోదించదగినది కాదని.. దిల్లీ అసెంబ్లీ పార్లమెంటుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఏడాది ఆరంభంలో ఈశాన్య దిల్లీలో సీఏఏ నిరసనలు హింసాత్మకంగా మారాయి. వాటిల్లో 53 మంది మరణించారు. అందుకుగానూ విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్ పట్టించుకోలేదని.. ఆగస్టు 31 జరిగిన విచారణలో కమిటీ తేల్చింది.