దేశవ్యాప్తంగా నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్లు తీవ్రతరమవుతున్నాయి. విపక్షాలు ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నాయి. కానీ, కేంద్రం మాత్రం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే 17 లక్షల మంది విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు గురువారం తెలిపారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. ఈ స్పందన ఆధారంగా విద్యార్థులు పరీక్షలు కోరుకుంటున్నారని భావిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
"నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అధికారులు నాకు చెప్పిన ప్రకారం వివరాల ప్రకారం.. దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ అడ్మిట్కార్డులు, మరో 10 లక్షల మంది నీట్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. విద్యార్థుల స్పందన చూస్తే అందరూ పరీక్షలు పెట్టాలని కోరుకుంటున్నారని అర్థమవుతోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పరీక్షలు నిర్వహించమని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ పరీక్ష కోసం దాదాపు రెండు, మూడేళ్లు కష్టపడినట్లు వాళ్లు చెప్తున్నారు."
-రమేశ్ పోఖ్రియాల్
ఆలస్యం చేస్తే ఏడాది వృథా: ఐఐటీ డైరెక్టర్లు
జేఈఈ, నీట్ పరీక్షలు ఇంకా వాయిదా వేస్తే విద్యార్థులకు ఏడాది వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు పలు ఐఐటీల డైరెక్టర్లు. పరీక్షలు నిర్వహించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తే విద్యా నాణ్యత దెబ్బతింటుందని హెచ్చరించారు.
"మహమ్మారి వల్ల ఇప్పటికే సగం విద్యాసంవత్సరంపై దెబ్బ పడింది. చాలా మంది విద్యార్థులు, సంస్థల ప్రణాళికలు దెబ్బతిన్నాయి. ఇప్పట్లో వైరస్ తగ్గే సూచనలు కనిపించట్లేదు. అందుకే ఈ విద్యా సంవత్సరాన్ని వృథా చేయాలని అనుకోవట్లేదు. అదే జరిగితే చాలా మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది."
-- అజిత్ చతుర్వేది, ఐఐటీ రూర్కీ డైరెక్టర్
ఐఐటీ రూర్కీతో పాటు ఐఐటీ ఖరగ్పుర్, ఐఐటీ రోపార్, ఐఐటీ గువాహటి, ఐఐటీ గాంధీనగర్ డైరెక్టర్లు పరీక్షలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్స్, నీట్ యూజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కోరుతూ.. బుధవారం రాత్రి దేశంలోని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలు ఏప్రిల్-మే మధ్య కాలంలో జరగాల్సింది. కానీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా రెండుసార్లు వాటిని వాయిదా వేశారు. జేఈఈ మెయిన్స్ సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు, నీట్ సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు. జేఈఈ కోసం 8.58 లక్షల మంది, నీట్ కోసం 15.97 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.