కరోనాపై పోరాడుతున్న అత్యవసర సేవల సిబ్బందికి యావద్దేశం అబ్బురపడేలా కృతజ్ఞతలు తెలిపాయి త్రివిధ దళాలు. గగనతలం నుంచి ఆసుపత్రి సిబ్బందిపై పువ్వులు చల్లుతూ జయజయ ధ్వానాలు పలికాయి. వివిధ ఆసుపత్రులకు వెళ్లిన ఆర్మీ జవాన్లు బ్యాండ్ వాయిస్తూ వైద్య సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఉదయం నుంచే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన నౌకాదళం సాయంత్రం మిరుమిట్లు గొలిపే కాంతులతో యోధురాలా సలాం అని అత్యవసర సేవల సిబ్బందికి వందనాలు సమర్పించింది.
పోలీసు వందనంతో ప్రారంభం..
ఉదయం దిల్లీలోని పోలీసు స్మారకం వద్ద కార్యక్రమం ప్రారంభమయింది. త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైన్యాధ్యక్షుడు నరవాణే, వాయుసేన సుప్రీం ఆర్బీఎస్ భదౌరియా, నౌకాదళ ప్రధానాధికారి కరంబీర్ సింగ్ నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ స్మారకం, రాజ్‌పథ్ ప్రాంతాల్లో పువ్వులు చల్లుతూ హెలికాఫ్టర్లు సందడి చేశాయి.
ఆకట్టుకునేలా ఆర్మీ బ్యాండ్స్..
ఆసుపత్రుల ఎదుట బ్యాండ్లు మోగించి కరోనా వీరులకు అభినందనలు తెలిపాయి సాయుధ బలగాలు. ప్రజలను కాపాడటంలో ముందున్న అత్యసవర సేవల సిబ్బందికి వందనాలు సమర్పించాయి. వైద్యశాలల వద్ద బ్యాండ్స్‌ను వాయిస్తూ దేశభక్తి గీతాలను ఆలపించాయి. జిరాక్‌పుర్‌లోని ఆర్మీ ఇంజినీర్ బ్రిగేడ్ మొహాలీలోని ఆసుపత్రిలో 30 నిమిషాల పాటు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది.
వైమానిక దళం.. పువ్వులతో వందనం
దేశవ్యాప్తంగా కొవిడ్ ఆసుపత్రులపై పూల వర్షం, యుద్ధ విన్యాసాలు చేస్తూ వందనం సమర్పించింది వైమానిక దళం. దిల్లీ రాజ్‌పథ్ మీదుగా సుఖోయ్-30 ఎంకేఐ, మిగ్-29, యుద్ధ విమానాలు విన్యాసాలు ప్రారంభించాయి. అనంతరం దిల్లీ వ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. కోల్‌కతాలో మిగ్-17, ముంబయి, అసోం, దిల్లీ ఆసుపత్రుల మీదుగా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. లఖ్‌నవూ కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ, భువనేశ్వర్‌లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులపై చక్కర్లు కొట్టాయి. పనాజీలోని గోవా ప్రభుత్వాస్పత్రి, హరియాణా పంచకుళలో ప్రభుత్వ కొవిడ్-19 ఆసుపత్రిపై పూలవర్షం కురిపిస్తుంటే జనం కేరింతలు కొట్టారు.
మిరుమిట్లు గొలిపే కాంతులతో.. నౌకాదళం..
మిరుమిట్లు గొలిపే కాంతులతో నౌకాదళానికి చెందిన ఓడలు అత్యవసర సిబ్బందికి వందనాలు సమర్పించాయి. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ పోరాటం చేస్తున్న కరోనా యోధులను కీర్తిస్తూ చేసిన విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ముంబయి, కొచ్చి, తిరువనంతపురం, చెన్నై, విశాఖపట్నం తీరాల్లో నౌకదళానికి చెందిన గస్తీ నౌకలు అత్యవసర సేవల సిబ్బందికి జయజయ ధ్వానాలు పలికాయి.