రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొద్ది రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఆగస్టు 14వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా అనుమతించారు.
రాష్ట్ర మంత్రివర్గ ప్రతిపాదనకు గవర్నర్ మిశ్రా ఆమోదం తెలిపినట్లు రాజ్‌భవన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటిస్తూ.. అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు.
హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు స్పీకర్..
అనర్హత నోటీసుపై ఈనెల 24న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించటం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం కల్పించిన స్పీకర్ అధికారాల్లో నేరుగా జోక్యం చేసుకోవటమేనని తెలిపారు. యథాతథ స్థితి కొనసాగించేందుకు ఎలాంటి కారణాలను వెల్లడించలేదని విన్నవించారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్యేల విలీనంపై హైకోర్టుకు బీఎస్పీ