జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత విధించిన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా సడలించింది. పరిస్థితి కుదుటపడుతున్న నేపథ్యంలో ఉదయం పూట ఆమలు చేస్తున్న ఆంక్షలను తొలగించింది. కశ్మీర్‌లోని 90 శాతం ప్రాంతాల్లో ఆంక్షలను ఎత్తేసినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 5న స్వయంప్రతిపత్తి రద్దు తర్వాత ఆంక్షలు కొనసాగబట్టి ఇప్పటికి 30 రోజులు పూర్తికావస్తోంది. మార్కెట్లు ఇంకా మూతపడి ఉండగా.. ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్ధరించాల్సి ఉంది.
కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలు, అంతర్ జిల్లా క్యాబులు, ఆటో రిక్షాలు నడుస్తున్నాయి. లాల్‌చౌక్, TRC చౌక్, దాల్‌గేట్ ప్రాంతాల్లో పలువురు వ్యాపారులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించినా.. భద్రతా దళాలను మాత్రం కొనసాగిస్తున్నారు. 95 టెలిఫోను ఎక్స్చేంజీల్లో 75 ఎక్స్చేంజీల్లో ల్యాండ్‌లైన్ ఫోన్ సర్వీసులను పునరుద్ధరించారు.
లాల్‌చౌక్, ప్రెస్ ఎన్‌క్లేవ్ సహా పలు చోట్ల ల్యాండ్‌లైన్ ఫోన్ల సేవలపై నిషేధం కొనసాగిస్తున్నారు. కుప్వారా, హంద్వారా పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు మినహా లోయలోని అన్ని ప్రాంతాల్లో సెల్‌ఫోన్, అంతర్జాల సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి. ఉద్యోగులూ వారి విధులకు హాజరవుతున్నారు. కశ్మీర్‌లో 4వేల పాఠశాలలు యథావిధిగా పని చేస్తున్నాయి.
ఇదీ చూడండి:భారత అమ్ములపొదిలోకి అత్యాధునిక 'అపాచీ'