'వాయు' తుపాను తన దిశను పూర్తిగా మార్చుకుని... గుజరాత్ తీరం నుంచి ఒమన్ వైపు కదులుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కానీ తుపాను ప్రభావం కొనసాగనుందని, రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో పెనుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తుపాను కేంద్రం భూభాగం నుంచి దూరంగా ఉన్నా... దాని వెలుపలి భాగం తీరంపై ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు, కెరటాల తాకిడికి పోర్బందర్లోని 150 ఏళ్లనాటి భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం ధ్వంసమైంది.
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) విడుదల చేసిన బులెటిన్ ప్రకారం వాయు తుపాను ఒమన్ వైపు వెళ్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. మరో 24 గంటలపాటు హై అలర్ట్ కొనసాగుతుందని రూపానీ స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా సౌరాష్ట్ర, కచ్ జిల్లాల్లోని పాఠశాలలను, శుక్రవారం మూసేస్తున్నామని ఆయన చెప్పారు.
వాయు తుపాను ప్రభావంతో తీరప్రాంతంలోని 12 తాలూకాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. 2.5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. తుపాను కారణంగా 86 రైళ్లను పూర్తిగా, 37 రైళ్లను పాక్షికంగా పశ్చిమ రైల్వే రద్దు చేసింది. కచ్, సౌరాష్ట్రల్లోని విమానాశ్రయాలనూ మూసివేశారు.
ఇదీ చూడండి: ఈఎస్ఐ పరిధి ఉద్యోగులకు కేంద్రం శుభవార్త