కరోనాతో అతలాకుతలం అవుతున్న ముంబయికు.. తుపాను రూపంలో మరో విపత్తు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఈ మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 12 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని తెలిపింది. ఈ తుపాను రేపు మధ్యాహ్నం ఉత్తర మహారాష్ట్ర , దక్షిణ గుజరాత్‌లో తీరం దాటనున్నట్లు వెల్లడించింది.
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో గోవాకు నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో ముంబయికి 550 కిలోమీటర్లు, సూరత్‌కు 770 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరాన్ని తాకే సమయానికి గాలులు గంటకు 105 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్న వాతావరణ శాఖ ముంబయిపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది.
మరోవైపు రుతు పవనాల ప్రభావంతో కేరళవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. నైరుతి రుతు పవనాలు నిన్ననే కేరళను తాకాయి. మరికొన్ని రోజుల్లో రుతు పవనాలు దేశమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి:కరోనాపై సామాజికాస్త్రం- రోగ నిరోధానికి మరో మార్గం