పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేక అల్లర్లతో అట్టుడికిన అసోంలో నిషేధాజ్ఞలు సడలించారు అధికారులు. గువాహటి సహా దిబ్రూగఢ్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు.
గువాహటిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. దిబ్రూగఢ్‌లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని.. అంతర్జాల సేవలంపై ఉన్న నిషేధాన్ని రేపటి వరకూ కొనసాగించనున్నట్లు అడిషనల్ డీడీ జీపీ సింగ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వదంతుల వ్యాప్తిని నిరోధించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
నిత్యవసరాల కోసం బారులు..
కర్ఫ్యూ సడలించిన నేపథ్యంలో నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు కిరాణ దుకాణాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గువాహటిలోని దిస్పుర్, ఉజాన్ బజార్, చంద్మరి, సిల్పఖురి, జూరోడ్లోని దుకాణాల వద్ద వందల మీటర్ల మేర క్యూలైన్లలో జనం వేచి ఉన్నారు. నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు.
హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నాం..
నిజమైన భారతీయులు, అసోం పౌరుల హక్కులను రక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్. పౌరసత్వ చట్ట సవరణపై తప్పదోవ పట్టించే వారిని, హింసను ప్రేరేపించే వారిని తరిమికొట్టాలని సూచిస్తూ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: అపస్మారక స్థితిలోకి స్వాతి మాలివాల్.. ఆస్పత్రికి తరలింపు