లఖ్‌నవూలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో పేలిన పెట్రోల్ బాంబు ఘటనకు రెండు వర్గాల మధ్య గొడవలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో ముగ్గురు న్యాయవాదులు గాయపడినట్లు తెలుస్తోంది.
'ఎవరూ చూడలేదు..'
ఘటనా స్థలం నుంచి మరో రెండు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ బాంబు దాడి జరిగినట్లు ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదని.. కనీసం శబ్దం కూడా ఎవరికూ వినిపించలేదని వెల్లడించారు. అయితే ఓ న్యాయవాది తన గది ముందే బాంబు పేలిందని పోలీసులకు తెలిపారు.
దాడి విషయం తెలియగానే భారీ సంఖ్యలో పోలీసులు.. బాంబ్ స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
నేనే లక్ష్యం: లోధీ
ఈ ఘటనపై లఖ్‌నవూ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజీవ్ కుమార్ లోధీ స్పందించారు. కొంతమంది న్యాయాధికారులపై ఫిర్యాదు చేసిన కారణంగా తనను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారని ఆరోపించారు.
"సుమారు 10 మంది నా ఛాంబర్ వెలుపల మూడు పెట్రోల్ బాంబులను విసిరారు. అందులో ఒకటి మాత్రమే పేలింది. నాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులు గాయపడ్డారు. పటిష్ఠ భద్రత ఉండే కోర్టులోనే ఇలాంటి దాడులు జరగడం ఏమిటి? అసలు కోర్టు ప్రాంగణంలోకి బాంబులు ఎలా వచ్చాయి? అధికారుల వైఫల్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలి. నాకు రక్షణ కల్పించాలి. "
-సంజీవ్ కుమార్ లోధీ, న్యాయవాది