సీపీఐ జాతీయ ప్రధాన కర్యదర్శి పదవికి సురవరం సుధాకర్ రెడ్డి రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జులై 19-20న జరిగే పార్టీ జాతీయ సమితి సమావేశంలో ఆయన పదవి నుంచి తప్పుకుంటారని సమాచారం.
"సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలోనే ఆయన రాజీనామా ప్రతిపాదించారు. పార్టీ సీనియర్ నాయకులు అందుకు అంగీకరించలేదు. ఓటమి సమష్టి బాధ్యత అని, ఒక్కరిది కాదని చెప్పారు. అయితే.. ఆరోగ్యం సహకరించని కారణంగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు సురవరం తెలిపారు. రాజీనామాపై జులైలో జరిగే జాతీయ సమితి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు."
-సీపీఐ వర్గాలు.
రాజీనామా విషయాన్ని సురవరం వద్ద ప్రస్తావించగా.. ఆయన ఖండించలేదు. స్పందించేందుకు నిరాకరించారు.
సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ ఘోర ఓటమి చవిచూసింది. దేశవ్యాప్తంగా కేవలం తమిళనాడులో రెండు ఎంపీ స్థానాల్లో గెలుపొందింది.
నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి సురవరం రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
2012 మే 31 నుంచి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
ఇదీ చూడండి: ఎస్సీఓ దేశాల మద్దతుతో ఉగ్రవాదంపై పోరు: మోదీ