పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛభారత్.. ఈ పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాలు, పథకాల పేర్లు గోవులకు పెడితే ఎలా ఉంటుంది? మీరు విన్నది నిజమే.. సరిగ్గా ఇలానే ఆలోచించాడు బిహార్ సమస్తిపుర్‌కు చెందిన అజిత్‌కుమార్ ఝా అనే వ్యక్తి. అందుకే తన గోశాలలోని గోవులకు ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన ఈ పథకాల పేర్లే పెట్టుకున్నాడు.
సమస్తిపుర్‌లోని సరైరంజన్కు చెందిన అజిత్ కుమార్ ఝా.. కొన్నేళ్ల క్రితం 3 ఆవులతో శివ గోశాలను ప్రారంభించాడు. అవే ఇప్పుడు 17 ఆవులుగా అభివృద్ధి చెందాయి. అయితే, ఈ ఆరేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఫిదా అయిపోయాడు అజిత్. వాటిని గౌరవిస్తూ.. తనకెంతో ఇష్టమైన గోమాతలకు ఆ పథకాల పేర్లను పెట్టుకుని.. ముద్దుగా పిలుచుకుంటున్నాడు.
అజిత్ మాత్రమే కాదు, ఈ పథకాల గోవులను చూసేందుకు గోశాలకు వచ్చే జనం.. అక్కడి పాలేర్లు అందరూ.. వాటిని ఇలాగే పిలుస్తారు. ఆవులు కూడా ఈ పేర్లకు అలవాటుపడిపోయాయి. జీఎస్టీ, ఆయుష్మాన్ అని పిలవగానే.. టక్కున స్పందిస్తున్నాయి.
ఇదీ చదవండి:వింత ఆచారం... పసి పిల్లలకు శునకాలతో వివాహం