గుజరాత్ సూరత్‌లో గోమాతను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది ఓ జంట. వారి పెళ్లికి మరెన్నో ప్రత్యేక ఏర్పాట్లు చేసి అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.
ఇదిగిదిగో పెళ్లి ప్రత్యేకతలు...
పెళ్లి తేదీ దగ్గరపడుతోంది కదా.. పెళ్లి పనులు ఎక్కడివరకు వచ్చాయి అని అడిగిన ఓ బంధువుకు... "ఆ.. దాదాపు అయిపోయినట్టే.. అచ్చమైన సంస్కృత భాషలో ఐదు పేజీల వస్త్ర శుభలేఖలు అచ్చయిపోయాయి. ముఖ్యఅతిథిగా గోమాత విచ్చేస్తున్నారు. 31 మంది వేద బ్రాహ్మణులు ఎలాగో వస్తున్నారు. ఇక ప్లాస్టిక్ మచ్చుకు కూడా కనిపించకూడదు కాబట్టి 5 వేల మట్టి గ్లాసులు సిద్ధంగా ఉన్నాయి. వీడియోలు, ఫొటోలూ గట్రా తీయించే పనిలేదు కాబట్టి వారికి చెప్పలేదు. ఇక పెళ్లికి వచ్చే కట్నాన్ని దేశం కోసం సేవ చేసే సంస్థలకు ఎలా అందించాలో ఆలోచించాలంతే.." అని సమాధానం చెప్పేశారు ఈ వధూవరులు.
చార్టర్డ్ అకౌంటెంట్ అభిలాష, అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్డీ చేస్తున్న రోహిత్ వివాహం ఫిబ్రవరి 3న జరగనుంది. విద్యావంతులైన వారిద్దరూ.. పెళ్లిలో ఆధునికతకుపోయి పర్యావరణాన్ని కలుషితం చేయాలనుకోవట్లేదు. పూర్తిగా భారతీయ సంప్రదాయంలోనే ఏడడుగులు వేసి ఒక్కటవ్వాలనుకుంటున్నారు.
అందుకే.. దశాబ్దాల క్రితం చూసిన ఘనమైన హిందూ కల్యాణ వైభోగాన్ని పునఃసృష్టించనున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ తరం వేడుకల్లాగా కృత్రిమంగా జరిపించకుండా.. స్వచ్ఛమైన వివాహ బంధంతో కొత్త జీవితంవైపు అడుగులు వేస్తున్నారు.
"మా పెళ్లిలో ప్రత్యేకత ఏమిటంటే.. మా వివాహ ఆహ్వాన పత్రిక సంస్కృతంలో ఉంటుంది. ఇక ముఖ్య అతిథిగా ఈ సృష్టిని కాపాడుతున్న గోమాత హాజరవుతుంది. మా పెళ్లి ఊరేగింపులో అందరికంటే ముందు పెళ్లిపెద్ద గోమాత ఉంటుంది. ఆ తరువాతే వరుడికి స్వాగతం దక్కుతుంది. గోమాత సాక్షిగా మేము ఏడడుగులు వేస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను మేము ఉపయోగించము. ఆ స్థానంలో ఐదు వేల మట్టి గ్లాసులు, పాత్రలు ఆర్డర్ చేశాం. దీని వల్ల కుమ్మరి వృత్తివారికి ఉపాధి లభిస్తుంది."
-రోహిత్, వరుడు
ఇదీ చదవండి:బావిలో పడిన ఏనుగును రక్షించేందుకు అదిరే ఐడియా